ఏపీలో జనసేన బలం పెరుగుతున్న విషయం తెలిసిందే…కాకపోతే అనుకున్నంత స్థాయిలో జనసేన బలం మాత్రం పెరగడం లేదు. గత ఎన్నికల్లో కేవలం 6 శాతం ఓట్లు తెచ్చుకుని..ఒక సీటు గెలుచుకుంది…కానీ తర్వాత కాస్త జనసేన పుంజుకుంది. ఇప్పుడు జనసేనకు దాదాపు 5-6 సీట్లు గెలుచుకునే సత్తా ఉందని, 9 శాతం ఓట్లు వరకు పడతాయని తాజా సర్వేలు చెబుతున్నాయి. అయితే 9 శాతం ఓట్లతో జనసేన పెద్దగా సత్తా చాటలేదు. అలాగే ఆ పార్టీకి పూర్తి స్థాయి నాయకత్వ బలం లేదు. దీని వల్ల జనసేన పార్టీకి పెద్ద ఇబ్బంది అవుతుంది.
అందుకే జనసేన బలం పెరగాలంటే వైసీపీ-టీడీపీల్లో బలమైన నాయకులని చేర్చుకోవాలి. కానీ పవన్ చేరికలపై ఇప్పటివరకు పెద్దగా ఫోకస్ పెట్టలేదు. దీంతో జనసేన అనుకున్నంత బలపడలేదు. అయితే ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో పవన్ రూట్ మారుస్తున్నారు. వైసీపీ-టీడీపీల్లో అసంతృప్తిగా ఉన్న నేతలని జనసేనలోకి లాగే ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా వైసీపీని గట్టిగా టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది.
ఇదే క్రమంలో తాజాగా రాజోలుకు చెందిన వైసీపీ నేత బొంతు రాజేశ్వరరావు జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారు. గత రెండు ఎన్నికల్లో బొంతు…వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. గత ఎన్నికల్లో రాజోలులో జనసేన నుంచి రాపాక వరప్రసాద్ గెలిచిన విషయం తెలిసిందే. ఆ వెంటనే రాపాక వైసీపీలోకి వెళ్ళిపోయారు. దీంతో రాజోలు వైసీపీలో వర్గపోరు మొదలైంది. ఇదే క్రమంలో ఇటీవల రాజోలు ఇంచార్జ్‌గా రాపాకని పెట్టారు. నెక్స్ట్ సీటు కూడా ఆయనకే ఫిక్స్ అయింది.
దీంతో ఎంతో కష్టపడిన బొంతుకు ఎదురుదెబ్బ తగిలింది. దీంతో ఆయన జనసేన వైపుకు వస్తున్నారు. సీటు హామీతోనే ఆయన జనసేనలోకి వస్తున్నారని తెలుస్తోంది. రెండుసార్లు ఓడిపోయిన సానుభూతి బొంతుపై ఉంది..అలాగే రాపాకపై తీవ్ర వ్యతిరేకత ఉంది. నెక్స్ట్ ఇక్కడ జనసేనకు గెలుపు అవకాశాలు ఉన్నాయి..టీడీపీతో పొత్తు ఉంటే భారీ మెజారిటీ ఖాయం..లేకపోయిన గెలుపు ఖాయమనే పరిస్తితి. ఆ మధ్య గుడివాడ, తెనాలి నియోజకవర్గాల్లో వైసీపీకి చెందిన కీలక నేతలు కూడా జనసేనలో చేరారు. ఇక నుంచి చేరికలు ముమ్మరం అయ్యే ఛాన్స్ ఉంది.