తనను కాదన్న వారిని నిలువరించడంలో ఓ సాధ్యత కొన్ని సార్లు కుదరకపోవచ్చు. సోనియాలాంటి వారికి అది కుదరలేదు కూడా! దాంతో తెలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ నామ రూపాల్లేకుండా ఉంది. అసలు ఆనవాళ్లు కూడా లేవు. డీసీసీ కార్యాలయాలు కొన్ని కల్యాణ మండపాలుగా మారిపోయి ఉన్నాయి. అయినా కూడా సోనియా పార్టీకి పూర్వ వైభవం ఇచ్చేందుకు ఎంతగానో కృషి చేస్తున్నారు. ఆ విధంగా ఆమె తన పంతం నెగ్గించుకునేందుకు నయా ప్లాన్ ఒకటి వేసి జగన్ కు ఝలక్ ఇచ్చారు.. ఇది కూడా ఓ విధంగా అధినేత్రి సాధించిన విజయాల్లో ఒకటి అని పరిగణింపవచ్చు.
ఓ విధంగా ఆయన్ను కాంగ్రెస్ కే పరిమితం చేయాలన్న ఆలోచన జగన్ ను కట్టడి చేసే వ్యూహం రెండూ ఒక్కటే! ఎందుకంటే ఆ రోజు నవ రత్నాలు అంటూ జగన్ ను ప్రజాకర్ష నేతగా మలిచింది ప్రశాంత్ కిశోరే కనుక! ఎందుకైనా మంచిది అన్న భావనతో ప్రశాంత్ కిశోర్ ను పార్టీలో చేర్చుకుని, ఇతర పార్టీలకు ఇకపై సలహాలు, సూచనలు ఇవ్వకుండా ముందు జాగ్రత్తల్లో ఉన్నారని తెలుస్తోంది. అదే కనుక జరిగితే సోనియా ఓ విధంగా రెండు తెలుగు రాష్ట్రాలపై మరో సారి పట్టు సాధించి, తన పంతం నెగ్గించుకునే అవకాశాలను కొట్టిపారేయడం వీలు కాని పని. ఆ విధంగా సోనియా ఇప్పుడు నయా రాజకీయాలకు తెరలేపి., చాలా కాలానికి సిసలైన పొలిటీషియన్ అన్న మాటకు తూగారు.
కాంగ్రెస్ మార్కు పాలిటిక్స్ లో ఎవరికైనా షరతులు వర్తిస్తాయి.ఇందులో తేడానే లేదు. ఒకటి కాదు రెండు కాదు అనేక మార్లు రుజువుకు నోచుకున్న నిజం ఇదే ! తాజాగా ఎన్నికల వ్యూహకర్తగా అభివర్ణిస్తున్న ప్రశాంత్ కిశోర్ అనే బీహారీ జీవితంపై కూడా కాంగ్రెస్ సీఈఓ సోనియా ముద్ర పడింది. అంటే ఆయన ఇకపై కొన్ని షరతులు పాటిస్తూనే కాంగ్రెస్ కోసం పనిచేయాలన్న నిబంధనలో భాగంగా ఇకపై అన్నీ అమల్లోకి వస్తాయి. ఆయనకు సంబంధించిన పనులు కూడా ఏం చేయాలో ఏం చేయకూడదో అన్నది అధినేత్రి నిర్ణయించనున్నారు.ఆ విధంగా ఈ బీహారీ తాను కేంద్రమంత్రిని కావాలన్న కలల కోసం కొన్ని త్యాగాలు కూడా చేసేందుకు సిద్ధం అవుతుండడం ఓ విశేషం.
ముఖ్యంగా ఆంధ్రా మరియు తెలంగాణల్లో ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించే అవకాశాలను కొట్టిపారేయలేం. అందుకే ఆయన తెలివిగా తన తరఫున కొందరిని ఉంచి వారితో వేరేగా ఒక కన్సల్టెన్సీని ప్రారంభింపజేయనున్నారా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది పీకే నుంచి విడిపోయి పొలిటికల్ కన్సల్టెన్సీ ఏజెన్సీలను ఏర్పాటు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఇవి కూడా పీకే వ్యూహంలో భాగంగానే ఉన్నాయి. పైకి ఇవి వెల్లడి కాకపోయినా, రేపటి వేళ ఆయన కాంగ్రెస్ లో చిరకాలం లేదా సుదీర్ఘ కాలం పనిచేయాల్సి వస్తే పొలిటికల్ స్ట్రాటజిస్టుగా కాంగ్రెస్ కే పనిచేయాల్సి ఉంటుంది అన్నది సోనియా షరతు. ఆ షరతు లోబడే పీకే ఇప్పుడు ఉన్నారని కూడా తెలుస్తోంది. తాజా నిర్ణయాలను అనుసరిస్తే ఇకపై ఆయన కేసీఆర్ కు కానీ జగన్ కు కానీ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా ఉండే అవకాశాలే లేవు. అదేవిధంగా నార్త్ లో కొన్ని ప్రాంతీయ పార్టీలకు కూడా పనిచేస్తున్నారు. ఇకపై వాటికి కూడా ఫుల్ స్టాప్ పడనుంది.