తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరమైన పోరు నడుస్తోంది…ఓ వైపు అధికార బిఆర్‌ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ..బిజేపి, కాంగ్రెస్ పార్టీలు ఫైట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో కాంగ్రెస్, బిఆర్‌ఎస్ ఒక్కటే అని బిజేపి ప్రచారం చేస్తుంది. ఆ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటాయని అంటున్నారు. ఇక కాంగ్రెస్ గెలిచిన సరే సిఎం అయ్యేది కేసిఆర్ అని తాజాగా బిజేపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ఇక మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి కేసిఆర్ ముడుపులు ఇచ్చారని, 25 కోట్లు ఇచ్చి పక్కకు తప్పించారని ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్‌కు రూ.25కోట్లు పంపించింది నిజం కాదా? ఇది వాస్తవం కాదని గుండెపై చేయి వేసుకుని బీఆర్‌ఎస్ నేతలు చెప్పగలరా? అంటూ ఈటల ప్రశ్నించారు. దీనిపై టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున ఫైర్ అయ్యారు. తమకు కేసిఆర్ 25 కోట్లు ఇచ్చారని నిరూపించాలని ఈటలకు రేవంత్ సవాల్ చేశారు.
కేసీఆర్, బీఆర్‌ఎస్ నుంచి ఒక్క రూపాయి కూడా సాయం పొందలేదని, ఈ మేరకు చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయం ఎదుట తడిబట్టలతో ప్రమాణం చేయడానికీ తాను సిద్ధమేనని, ఈటలకు భాగ్యలక్ష్మి అమ్మవారిపై నమ్మకం లేకుంటే ఏ దేవాలయంలోనైనా తడి బట్టలతో ప్రమాణం చేయడానికి తాను సిద్ధమని ఛాలెంజ్ చేశారు.
అయితే ఇలా ఇద్దరు నేతలు సవాళ్ళు విసురుకోవడం వల్ల బిఆర్‌ఎస్ నేతలు పండుగ చేసుకుంటారని, బిఆర్‌ఎస్ తో పోరాడే తమ్ముళ్లు రేవంత్, ఈటల తమ దాడిని ఒకరిపై ఒకరు కాకండా ఎవరి ధోరణిలో వారు ప్రభుత్వంపై పోరాడటం అవసరమేమో.. అని బిజేపి నాయకురాలు విజయశాంతి అన్నారు. అయితే పరిస్తితి చూస్తే అలాగే ఉంది. ఈటల, రేవంత్ పోరుతో కారు నేతలకే బెనిఫిట్. మరి వీరి పోరు ఇంతటితో ఆగుతుందో లేదో చూడాలి.