ఓట్ల లెక్కింపు సందర్భంగా ఏపీ పోలీసులు సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్‌ల నివాసాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలో ఉన్న జగన్ నివాసం వద్ద, అలాగే పార్టీ కార్యాలయం వద్ద, ఏపీ సీఎం చంద్రబాబు నివాసాల వద్ద కూడా పోలీసులు ఇప్పటికే భద్రతను పెంచారు.
అటు లోక్‌సభతోపాటు ఇటు ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా రేపే వెలువడనున్న నేపథ్యంలో ఏపీలో ప్రధాన పార్టీలకు చెందిన నేతల్లో టెన్షన్ తారా స్థాయికి చేరుకుంది. తాము గెలుస్తామో, లేదోనని వారు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. అయితే మరోవైపు లోక్‌సభతోపాటు ఏపీ అసెంబ్లీ ఓట్ల లెక్కింపు రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుండగా, ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు. ఈ క్రమంలో ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు ఉదయం 8.30 గంటలకు ప్రారంభం కానుంది.
అయితే ఓట్ల లెక్కింపు సందర్భంగా ఏపీ పోలీసులు సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్‌ల నివాసాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలో ఉన్న జగన్ నివాసం వద్ద, అలాగే పార్టీ కార్యాలయం వద్ద, ఏపీ సీఎం చంద్రబాబు నివాసాల వద్ద కూడా పోలీసులు ఇప్పటికే భద్రతను పెంచారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకే భద్రతను పెంచామని పోలీసులు తెలిపారు.
కాగా జగన్, చంద్రబాబు నివాసాల వద్ద ఏపీఎస్పీ కి చెందిన రెండేసి కంపెనీల పోలీసులు పహారాలో ఉంటారని, అలాగే ఎంపీలు, ఎమ్మెల్యేలుగా గెలిచిన అభ్యర్థుల నివాసాల వద్ద కూడ భద్రతను పెంచుతామని పోలీసులు తెలిపారు. గెలిచిన అభ్యర్థులు తమ ఇల్లు లేదా పార్టీ కార్యాలయాలకు చేరుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ రెండు ప్రదేశాల వద్ద భద్రతను పెంచుతామని పోలీసులు తెలిపారు. జగన్, చంద్రబాబుల నివాసాల వద్ద పార్కింగ్ కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేశామని అన్నారు. ఈ క్రమంలో బాంబ్ స్క్వాడ్‌లతో ఆయా ప్రదేశాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతామని కూడా పోలీసులు తెలిపారు..!