తెలంగాణ ‘హస్త’గతం కానుందా..? పొంగులేటి ట్వీట్ పై మొదలైన ఊహాగానాలు

-

పొంగులేటి శ్రీనివాసరెడ్డి. . . .ఖమ్మం జిల్లాలో మంచి పేరున్న నేత.అంతే కాదు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయాలను శాసించే నాయకుడు ఈయన.పొంగులేటి ఏ పార్టీలో ఉంటారో ఖమ్మం జిల్లాలో ఆ పార్టీయే లీడింగ్‌లో ఉంటుంది. అయితే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ బిఆర్‌ఎస్‌ నుంచి ఇటీవల అయన్ను బహిష్కరించారు. ఈ నేపథ్యంలో పొంగులేటి ఏ పార్టీలో చేరతారనే సందేహం అందరిలోనూ మెదిలింది. బీజేపీలోకి రావాలంటూ ఈటెల రాజేందర్‌…. శ్రీనివాస్‌రెడ్డితో చర్చలు జరిపారు.

ఆ తరువాత రాహుల్‌ టీమ్‌ కూడా పొంగులేటి వద్దకు విచ్చేసి కాంగ్రెస్‌లోకి రావాలని కోరింది.అయితే ఏ పార్టీలో చేరే విషయమై ఎవ్వరికీ ఆయన స్పష్టతనివ్వలేదు. ఇటీవల ప్రజాశాంతి పార్టీ అధినేత కెఏ పాల్‌ పొంగులేటికి ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించారు. తన పార్టీలో చేరితే అధికారంలోకి వచ్చాక డిప్యూటీసీఎం పదవి ఇస్తానన్నారు. దీనిపై పొంగులేటి నుంచి ఎలాంటి స్పందన లేదు.తెలంగాణలోని రాజకీయాలపై పట్టున్న ఆయన….ఇటీవల ఓ ఆసక్తికర ట్వీట్‌ చేశారు. తాను ఏ పార్టీలో చేరేది మరో పక్షం రోజుల్లో క్లారిటీ ఇస్తానని,ఆ పార్టీయే తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ట్విటర్‌లో పేర్కొన్నారు.

 

ఆ ట్వీట్‌ ఇచ్చి వారం గడవక ముందే కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం నుంచి గ్రీన్‌సిగ్నల్‌ వచ్చింది.ఆయన పెట్టిన షరతులకు ఓకే చెప్పిన కాంగ్రెస్‌ ఆయనతో పాటు అనుచరులను చేర్చుకునేందుకు అంగీకరించింది. ఈ నెల 20 లేదా 25వ తేదీన ఆయన కాంగ్రెస్‌ పార్టీ కండువా కప్పుకోనున్నారు. ఆయనతో పాటు మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు కూడా కాంగ్రెస్‌ గూటికి వెళ్ళేందుకు సిద్ధమయ్యారు.

 

ఇదిలా ఉంటే ప్రస్తుతం పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన ట్వీట్‌ తెలంగాణలో చర్చకు దారి తీసింది. తాను చేరే పార్టీయే తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో గెలుస్తుందని ట్విటర్‌ మెసేజ్‌లో పొంగులేటి స్పష్టం చేశారు. అంటే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలుస్తుందా అనే చర్చలు ఊపందుకున్నారు. ఈ చర్చలు కాంగ్రెస్‌ పార్టీ నేతలకు మరింత ఉత్సాహాన్నివ్వగా బిఆర్‌ఎస్‌ పార్టీ నేతలు కొట్టిపారేస్తున్నారు. పదేళ్ళ తెలంగాణ రాష్ర్టంలో బృహత్తర కార్యక్రమాలను తెచ్చి అభివృద్ధి చేసిన బిఆర్‌ఎస్‌ను ప్రజలు మరచిపోరని, మళ్ళీ కెసిఆర్‌ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ఊదరగొడుతున్నారు.

ప్రధానంగా కాంగ్రెస్‌ పార్టీ నేతలే లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తూ ముందుకెళతున్నారు.మరోవైపు సీఎల్‌పి నేత భట్టి విక్రమార్క చేస్తున్న పాదయాత్రకు విశేష ఆదరణ లభిస్తోంది. అక్కడక్కడా బహిరంగ సభలు నిర్వహిస్తుండగా ఏఐసీసీకి చెందిన ముఖ్యనేతలు ఈ సభల్లో పాల్గొంటూ ప్రజలను ఆకట్టుకునేలా ప్రసంగాలు చేస్తున్నారు. మరి పొంగులేటి జోస్యం నిజమవుతుందా లేదా అనేది వేచి చూడాలి

Read more RELATED
Recommended to you

Latest news