వ్యూహ ప్ర‌తివ్యూహాల్లో హోరాహోరీ

-

ఎన్నికల వ్యూహాల్లోకానీ, ఇతరత్రా వ్యూహాలను అమలు చేయడంలోకానీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబునాయుడికి ఉన్న పేరు మ‌నంద‌రికీ తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌రెడ్డి నుంచి ఇప్పుడు చంద్ర‌బాబుకు గట్టి పోటీ ఎదురవుతోంది. రాజకీయ వ్యూహాల్లో చాణ‌క్యుడైన చంద్రబాబుకు ఇప్పుడు అదే రాజకీయాల నుంచి ముఖ్యమంత్రి జగన్ త‌న ప్ర‌తివ్యూహాల‌తో సవాల్ విసురుతున్నారు. తనదైన శైలిలో వ్యూహాలు అమలు చేస్తున్న జగన్ ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. వ్యూహం పన్నడం వేరు.. దాన్ని అమలు చేయడంవేరు.. వ్యూహాత్మకంగా వ్యవహరించడం వేరు. కానీ ఏపీలో జగన్‌రెడ్డి వ్యూహాలకు ఎదురులేకుండా పోయిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వ్యూహాత్మక నిర్ణయాలు ఎవరైతే తీసుకుంటారో వారినే విజయం వరిస్తుందంటున్నారు. జగన్‌రెడ్డి ఆ విషయంలో చంద్రబాబుమీద పై చేయి సాధించారని చెప్పవచ్చు.

ఓట్లు కొల్ల‌గొట్టిన చేయూత‌

మహిళల కోసం తీసుకున్న రెండు నిర్ణయాలు స్థానిక సంస్థ‌ల ఎన్నికలపై తీవ్ర ప్రబావం చూపించాయి. వైసీపీకి ఘ‌న‌విజ‌యాన్నిసాధించిపెట్టాయి. మరో రెండురోజుల్లో నగరపాలక సంస్థలకు ఎన్నికలు జరుగుతాయనగా 45 సంవత్సరాలు నిండిన అగ్రవర్ణ మహిళలకు చేయూత పథకాన్నిజ‌గ‌న్ అమలు చేశారు. ఈ పథకం కింద ఏటా రూ.15 వేలు అందిస్తారు. అదేసమయంలో మహిళా ఉద్యోగులకు మెటర్నిటీ సెలవులు, క్యాజువల్ సెలవులను పెంచారు. వాస్తవానికి జగన్ వేసిన ఈ వ్యూహాన్ని తెలుగుదేశం నేతలు గుర్తించలేకపోయారు. గుర్తించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దారుణ ప‌రాజ‌యాన్ని చ‌విచూడ‌క త‌ప్ప‌లేదు.

ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి విమానాశ్ర‌యం

రాజకీయంగా బలోపేతం కావడానికే ప్రతి అడుగు వేస్తున్న జగన్‌ తాజాగా కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయంలో విమానాల రాకపోకలను ప్రారంభించారు. కర్నూలు ప్రజల సెంటిమెంటును ఈ సందర్భంగా ఆయన తనకు అనుకూలంగా మలచుకున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెడుతున్నట్లు అక్కడి వేదికపైనే ముఖ్యమంత్రి ప్రకటించారు. రాయలసీమ ప్రజల కోరికలను తానొక్కడే తీర్చేది.. ప్రత్యామ్నాయం మరెవరూ లేరన్నరీతిలో జగన్ వ్యవహరించారు. రాయ‌ల‌సీమ‌లో జ‌గ‌న్‌ను ఎదుర్కొనే ధీటైన నేత కూడా క‌న‌ప‌డ‌టంలేదు.

రాజ‌ధాని అభివృద్ధికి క‌ట్టుబ‌డి ఉన్నామంటున్నారు

మూడు బ్యాంకుల నుంచి రూ.10వేల కోట్లు అప్పుచేసి మూడు దశల్లో రాజధానిని అభివృద్ధి చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందంటూ ఏపీ ప్ర‌భుత్వం జీవో జారీచేసింది. దీనిద్వారా అమరావతిని తరలిస్తున్నారనే విమర్శలను ఆపగలిగారు. రూ.3 వేల కోట్లను ప్రభుత్వ హామీపై తీసుకుంటున్నామని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులవల్ల తక్షణమే ఎవరూ ప్రభుత్వంపై విమర్శలు చేయలేకపోయారు. ముఖ్యమంత్రి జగన్‌ ప్రతి అడుగూ అత్యంత పకడ్బందీగా వేస్తున్నారని, ప్రతి అడుగులో రాజకీయ ప్రయోజనాలు సమకూరుతున్నాయని, వీటిని గుర్తించి ఎత్తుగడలు వేయ‌లేక‌పోతే మున్ముందు తెలుగుదేశం పార్టీకి ఇబ్బందులు తప్పకపోవచ్చనేది రాజకీయ విశ్లేషకుల భావన. జ‌గ‌న్ వ్యూహాల‌కు ప్ర‌తివ్యూహాలు వేసేవారు తెలుగుదేశంలోకానీ, జ‌న‌సేన‌లోకానీ బీజేపీలోకానీ ఉన్నారా? అంటే లేర‌నే చెప్ప‌వ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Latest news