కొలువు తీరిన తెలంగాణ మంత్రివర్గం.. కొత్త మంత్రులు వీళ్లే..!

-

తెలంగాణ మంత్రి వర్గం కొలువు తీరింది. తెలంగాణ కొత్త మంత్రులు ఇవాళ రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, ఇతర ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా నిర్మల్ ఎమ్మెల్యే అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత తలసాని శ్రీనివాస్ యదవ్, గుంటకండ్ల జగదీశ్ రెడ్డి, ఈటల రాజేందర్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, వేముల ప్రశాంత్ రెడ్డి, చామకూర మల్లారెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం సీఎం కేసీఆర్, గవర్నర్ నరసింహన్ ఆశీర్వాదం తీసుకున్నారు.

అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

నిర్మల్ ఎమ్మెల్యే, 1981 లో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1987 లో ఆదిలాబాద్ జెడ్పీ చైర్మన్ గా ఎన్నికయ్యారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎంపీగా గెలుపొందారు. గత ప్రభుత్వంలో దేవాదాయ, గృహనిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

తలసాని శ్రీనివాస్ యాదవ్

సనత్ నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1995 నుంచి 1999 వరకు కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. 2001 నుంచి 2003 వరకు టూరిజం శాఖ మంత్రిగా పనిచేశారు. గత టీఆర్ఎస్ హయాంలో పాడి పరిశ్రమ, సినిమాటోగ్రఫీ మంత్రిగా పనిచేశారు.

గుంటకండ్ల జగదీశ్ రెడ్డి

సూర్యాపేట ఎమ్మెల్యే. సూర్యాపేట నియోజకవర్గం నుంచి రెండోసారి గెలుపొందారు. 2014 లో టీఆర్ఎస్ నుంచి గెలిచి విద్యుత్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. సీఎం కేసీఆర్ వెన్నంటే మొదటి నుంచీ నడిచిన వ్యక్తి జగదీశ్ రెడ్డి.

ఈటల రాజేందర్

హుజూరాబాద్ ఎమ్మెల్యే. గత ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. మొదటి నుంచి పార్టీలో, ఉద్యమం సమయంలో ఈటల చురుకైన పాత్ర పోషించారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2008-14 వరకు టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ గా పనిచేశారు.

సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

వనపర్తి ఎమ్మెల్యే. టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి సీఎం కేసీఆర్ వెంటే నడిచిన నేతల్లో నిరంజన్ రెడ్డి ఒకరు. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం అధ్యక్షుడిగా ఐదేళ్లు పనిచేశారు. వనపర్తి నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇదివరకు రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తించారు.

కొప్పుల ఈశ్వర్

ధర్మపురి ఎమ్మెల్యే. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 నుంచి 2018 వరకు ప్రభుత్వ చీఫ్ విప్ గా పనిచేశారు. 1981 నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది. రెండున్నర దశాబ్దాల పాటు సింగరేణిలో ఉద్యోగం చేశారు.

ఎర్రబెల్లి దయాకర్ రావు

పాలకుర్తి ఎమ్మెల్యే. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి సీనియర్ ఎమ్మెల్యే. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఒకసారి ఎంపీగా గెలిచారు. 1982 లో ఎర్రబెల్లి రాజకీయాల్లోకి వచ్చారు. 1999 నుంచి 2003 వరకు ప్రభుత్వ విప్ గా పనిచేశారు.

శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్ ఎమ్మెల్యే. రెండుసార్లు మహబూబ్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగ సంఘాలను ఏకం చేసి కీలకపాత్ర పోషించారు శ్రీనివాస్ గౌడ్. గతంలో రంగారెడ్డి జిల్లాలోని పలు మున్సిపాలిటీలకు కమిషనర్ గా పనిచేశారు. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ల సంఘానికి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు.

వేముల ప్రశాంత్ రెడ్డి

బాల్కొండ ఎమ్మెల్యే. గతంలో మిషన్ భగీరథ వైస్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తించారు. తెలంగాణ ఉద్యమంలోనూ వేముల చురుకైన పాత్ర పోషించారు. బాల్కొండ నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

చామకూర మల్లారెడ్డి

మేడ్చల్ ఎమ్మెల్యే. మల్లారెడ్డి విద్యా సంస్థల అధినేత. 2014 లో మల్కాజిగిరి ఎంపీగా గెలుపొందారు.

Read more RELATED
Recommended to you

Latest news