ఆగస్టు 15 నుంచి మరో మూడు పథకాలు… ఏపీ ప్రభుత్వం కసరత్తు

-

మునుపటిలా కాకుండా హామీల అమలుపై ఏపీలోని కూటమి ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తోంది.పింఛన్లు పెంపు, మెగా డీఎస్సీ , ఉచిత ఇసుక, ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు వంటి హామీలను నిలబెట్టుకున్న ప్రభుత్వం మరో మూడు కీలక ఎన్నికల హామీలు అమలు దిశగా కసరత్తు చేస్తోంది. పేదల ఆకలి తీర్చే అన్నక్యాంటీన్లు ఏర్పాటుతో పాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, హెల్త్‌ ఇన్స్‌రెన్స్ పథకాలు అమలుపై దృష్టిసారిస్తోంది.అన్నీ కుదిరితే ఆగస్టు 15 నుంచి అన్న క్యాంటీన్లు అందుబాటులోకి రావడమే కాదు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా అదే రోజు నుంచి అందుబాటులోకి తెచ్చేoదుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

2014-2019 మధ్య కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం అన్నక్యాంటీన్లు తీసుకొచ్చింది.ఐదురూపాయలకే పేదల ఆకలి తీర్చే ఈ క్యాంటీన్లను మళ్లీ పునరుద్ధరిస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన చంద్రబాబు వాటి రూపకల్పన చేస్తున్నారు.ఆగస్టు 15 నుంచి అన్న క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి. శిథిలావస్థకు చేరిన క్యాంటీన్ భవనాలను తిరిగి పునరుద్ధరిస్తున్నారు. ఇప్పటికే 183 అన్నక్యాంటీన్లు అందుబాటులోకి తెచ్చేందుకు స్థానిక పురపాలకశాఖలకు అప్పగించి దాదాపు 20 కోట్ల రూపాయల నిధులను అందజేశారు.అన్నక్యాంటీన్లకు అవసరమైన కంప్యూటర్లు, ప్రింటర్లు, ఇంటర్‌నెట్ పరికరాల కొనుగోలు కోసం మరో 7 కోట్ల రూపాయలు ఇచ్చారు.తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే నిర్మాణ దశలో ఆగిపోయిన మరో 20 అన్నక్యాంటీన్ భవనాలను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు.

అలాగే ఉచిత ఆర్టీసీ బస్సుప్రయాణ సౌకర్యo కల్పనపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆగస్టు 15న ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.ఆధార్ కార్డు ఆధారంగా రాష్ట్రంలో ఉన్న మహిళలoదరికీ ఈ అవకాశం కల్పించేందుకు చకచకా ఏర్పాట్లు సాగిపోతున్నాయి.కర్ణాటక,తెలంగాణలో ఈ పథకం పనితీరును పరిశీలించిన అధికారులు అక్కడి ఇబ్బందులు, సాంకేతిక అంశాలు, నిర్వహణ భారం వంటి అంశాలపై అధ్యయనం చేశారు.అయితే అక్కడి కన్నా మెరుగ్గా ఈ పథకాన్ని నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.ఇక ప్రతి కుటుంబానికి 25లక్షల ఆరోగ్య బీమా కల్పించేందుకు కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కేంద్రం ఇప్పటికే ఆయూష్మాన్‌ భారత్ పేరిట 5 లక్షల ఇన్స్‌రెన్స్ అందిస్తుండగా…దీన్ని పది లక్షలకు పెంచనున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం దీనికి అదనంగా మరో 15 లక్షలు కలిపి ప్రజలకు అందించేలా కసరత్తు చేస్తోంది.ఈ మూడు పథకాలను ఆగష్టు 15న ప్రారంభించేందుకు చంద్రబాబు టార్గెట్ గా పెట్టుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version