ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ తో పాటు కమ్యూనిస్టులకు పట్టు ఉన్న విషయం తెలిసిందే. గతంలో కాంగ్రెస్, కమ్యూనిస్టులు, టిడిపి..ఈ మూడు పార్టీలు మంచి విజయాలు సాధించేవి. అయితే రాష్ట్ర విభజన తర్వాత కమ్యూనిస్టుల హవ తగ్గింది. అలా అని బిఆర్‌ఎస్ బలం పెరగలేదు. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 10 సీట్లు ఉంటే కాంగ్రెస్ 6, టిడిపి 2, బిఆర్‌ఎస్ 1, ఇండిపెండెంట్ ఒకరు గెలిచారు.
కానీ అధికారంలోకి రావడంతో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మినహా అందరినీ బిఆర్‌ఎస్ లోకి తీసుకున్నారు. దీంతో జిల్లాపై పట్టు పెంచుకున్నారు. అయితే ఈ సారి ఎన్నికల్లో బిఆర్‌ఎస్ గెలవడం సులువు ఏమి కాదు. కొన్ని స్థానాల్లో బిఆర్‌ఎస్ పార్టీకి కాంగ్రెస్, టిడిపి, వైఎస్సార్టీపీ పార్టీలు గట్టి పోటీ ఇవ్వనున్నాయి. అందులో పాలేరులో పోరు రసవత్తరంగా సాగనుంది. ఎందుకంటే ఇక్కడ షర్మిల డైరక్ట్ గా బరిలో దిగుతునారు.
ప్రస్తుతం ఇక్కడ ఉపేందర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈయన కాంగ్రెస్ లో గెలిచి బిఆర్‌ఎస్ లోకి వచ్చారు. ఇక అదే బిఆర్‌ఎస్ లో తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. దీంతో ఎవరికి సీటు దక్కుతుందో అర్ధం కాకుండా ఉంది. షర్మిల పోటీ చేస్తుండటంతో హాట్ ఫైట్ జరగనుంది. అలాగే ఇక్కడ టిడిపికి కాస్త పట్టు ఉంది. తుమ్మల పోటీ చేస్తే టిడిపి వర్గం..ఆయనకే సపోర్ట్ చేస్తుంది. ఇటు షర్మిలకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్గం సపోర్ట్ చేయవచ్చు. అలాగే బిఆర్‌ఎస్ పార్టీకి కమ్యూనిస్టుల మద్దతు ఉంది.
దీంతో పాలేరు పోరు ఆసక్తికరంగా ఉంది. ఇప్పుడు అసలు అక్కడ ఎవరు ఆధిక్యంలో ఉన్నారో అర్ధం కాకుండా ఉంది. అసలు పోటీ చేసే విషయంలో బిఆర్‌ఎస్ లోనే క్లారిటీ లేదు. ఉపేందర్ పోటీ చేస్తే తుమ్మల వర్గం సపోర్ట్ ఇవ్వదు, తుమ్మల పోటీ చేస్తే ఉపేందర్ వర్గం సపోర్ట్ ఇవ్వదు. మొత్తానికి పాలేరు పోరులో గెలిచేది ఎవరో అర్ధం కాకుండా ఉంది.