పార్లమెంట్ లో రాష్ట్ర విభజన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై వివాదం ఇంకా పెరుగుతుంది. ఇప్పటికే నిన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ నేతలు నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేశారు. అలాగే ట్విట్టర్ లో #ModiEnemyOfTelangana హ్యష్ ట్యాగ్ ను కూడా ట్రెండింగ్ లో పెట్టారు. ఇప్పుడు తాజాగా పార్లమెంట్ లో ప్రధాని మోడీకి సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇవ్వాలని టీఆర్ఎస్ ఎంపీలు నిర్ణయించారు.
ప్రధాని మోడీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పోరరాటాన్ని కించ పరిచేలా వ్యాఖ్యలు చేశారని టీఆర్ఎస్ రాజ్య సభ ఎంపీ కే కేశవ రావు అన్నారు. అంతే కాకుండా దేశంలోనే అత్యున్నత చట్టసభలను కించ పరిచేలా.. అగౌర పరిచేలా మోడీ మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం తొందర పాటు వల్ల ఏర్పాటు కాలేదని అన్నారు. కొన్ని సంవత్సరాల పాటు పోరాటం, వేలాది మంది బలిదానాల వల్ల తెలంగాణ ఏర్పాటు అయిందని అన్నారు. కాగ వచ్చె పార్లమెంట్ బడ్జెట్ మొదటి విడత సమావేశాల్లో మోడీపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇస్తామని తెలిపారు.