కమలంలో ఆగని లొల్లి..కిషన్‌కు తలనొప్పి తప్పదా?

-

తెలంగాణ బీజేపీలో నేతల మధ్య విభేదాలు తగ్గినట్లు లేవు. అంతర్గతంగా రచ్చ చేస్తూనే ఉన్నారు. కిషన్ రెడ్డి అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించిన కూడా నేతలు కలిసికట్టుగా పనిచేసి..పార్టీని మళ్ళీ బలోపేతం చేద్దామనే ఆలోచనలో ఉన్నట్లు లేరు. ఎక్కడకక్కడ సొంత పార్టీ నేతలకే చెక్ పెట్టేసుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే అనేక విభేదాల తర్వాత బండి సంజయ్‌ని తప్పించి కిషన్ రెడ్డిని అధ్యక్షుడుగా పెట్టారు.

దీంతో విభేదాలు ఏమైనా ఆగుతాయేమో అనుకున్నారు. కానీ అలా జరగడం లేదు. ఇంకా రచ్చ నడుస్తూనే ఉంది. తాజాగా కిషన్ రెడ్డి..అధ్యక్ష బాధ్యతలని స్వీకరించే స్టేజ్ పైనే నేతల మధ్య విభేదాలు కనిపించాయి. మొదట బండి సంజయ్..బి‌జే‌పిలో అంతర్గతంగా తనపై కుట్రలు చేస్తున్న నేతలని టార్గెట్ చేశారు.  జాతీయ నాయకత్వానికి తనపై కొందరు లేనిపోని ఫిర్యాదులు చేశారని, ఇకనైనా అలాంటి వాటిని మానుకోవాలని హితవు పలికారు. కిషన్‌రెడ్డినైనా ప్రశాంతంగా పనిచేసుకోనివ్వాలని అన్నారు.

అయితే బండిని అధ్యక్ష పదవి నుంచి తప్పించే ముందు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి..అక్కడే  మూడు రోజులు మకాం వేశారు. ఈ క్రమంలోనే వారిద్దరు..బండిపై ఫిర్యాదులు చేశారని, అందరినీ కలుపుకుని వెళ్ళడం లేదని పెద్దలకు కంప్లైంట్ చేశారని కథనాలు వచ్చాయి. ఆ వెంటనే బండిని తప్పించారు. ఇప్పుడు వారిని ఉద్దేశించే బండి ఈ వ్యాఖ్యలు చేశారని తెలుస్తుంది.

సరే వీరి మధ్య రచ్చ జరుగుతుండగానే..విజయశాంతి సడన్ గా ఆ కార్యక్రమం మధ్యలోనే వెళ్ళిపోయారు. దీనిపై ఆమె తర్వాత వివరణ ఇస్తూ..మాజీ సి‌ఎం కిరణ్ కుమార్ రెడ్డిని టార్గెట్ చేశారు. ఆయన కూడా స్టేజ్ పై ఉండటం విజయశాంతికి నచ్చక వెళ్ళిపోయారు. తెలంగాణకు వ్యతిరేకంగా పోరాడిన వారితో స్టేజ్ పంచుకోలేక వెళ్లిపోయానని ఆమె చెప్పుకొచ్చారు. మొత్తానికి కమలంలో అంతర్గత విభేదాలు ఎక్కువగానే ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version