తెలంగాణలో ఉపఎన్నికల కాలం నడుస్తోంది..ఇప్పటికే నాలుగు ఉపఎన్నికలు నడిచాయి. ప్రస్తుతం మునుగోడు ఉపఎన్నిక నడుస్తోంది. అయితే రెండు ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవగా, రెండు ఉపఎన్నికల్లో బీజేపీ గెలిచింది. అయితే హుజూరాబాద్, మునుగోడు కేవలం బీజేపీ వ్యూహంలో భాగంగానే వచ్చాయి. బీజేపీలో చేరుతున్న ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేయడంతో ఉపఎన్నికలు వస్తున్నాయి. ఇప్పటికే హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్ బలం వల్ల అక్కడ బీజేపీ సత్తా చాటింది.
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని చేర్చుకున్నారు…ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మునుగోడు ఉపఎన్నిక వచ్చేలా చేశారు. ఈ ఉపఎన్నిక చుట్టూనే ఇప్పుడు తెలంగాణ రాజకీయం నడుస్తోంది. ఇదిలా ఉంటే ఆ మధ్య 10 ఉపఎన్నికలు వరకు వస్తాయని..టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొందరు బీజేపీలోకి రానున్నారని బండి సంజయ్ కామెంట్ చేశారు. అయితే ఇంతవరకు ఏ ఎమ్మెల్యే బీజేపీలోక్ వస్తున్నట్లు కనిపించడం లేదు. కానీ అనూహ్యంగా ఇప్పుడు వేములవాడ ఉపఎన్నిక అంటూ ప్రచారం నడుస్తోంది.
విదేశీ పౌరసత్వం ఉన్న ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌పై వేటు పడుతుందని, దీంతో వేములవాడ ఉపఎన్నిక వస్తుందని బీజేపీ నేతలు అంటున్నారు. అయితే ప్రస్తుతానికి రమేశ్ పౌరసత్వం కేసు కోర్టులో ఉంది..త్వరలోనే తీర్పు వెలువడనుంది. ఇక ఈ తీర్పు రమేశ్‌కు వ్యతిరేకంగానే వస్తుందని, ఆయనపై వేటు పడుతుందని బీజేపీ నేతలు అంటున్నారు. మరో మూడు నెలల్లో వేములవాడలో ఉప ఎన్నిక రాబోతోందని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు చెబుతున్నారు.
రమేశ్ ఏ దేశ పౌరుడో తెలియదనీ, ఎనిమిదేళ్లుగా కోర్టులను అడ్డం పెట్టుకొని ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారని విమర్శించారు. ఇక ఆయనపై వేటు పడితే వేములవాడ ఉపఎన్నిక వస్తుందని రఘునందన్ అంటున్నారు. ఇక హుజూరాబాద్ కోసం దళితబంధు తీసుకొచ్చారని, ఇప్పుడు మునుగోడు కోసం గిరిజన బంధు అంటున్నారని, వేములవాడ ఉపఎన్నిక వస్తే బీసీ బంధు అంటరాని రఘునందన్ విమర్శిస్తున్నారు. మరి చూడాలి వేములవాడ ఉపఎన్నిక వచ్చే అవకాశం ఉందో లేదో.