రాష్ట్రాన్ని ప్రైవేటీకరించడమే కేసీఆర్ సర్కారు లక్ష్యమా..?

కేసీఆర్ సర్కారుపై మాజీ ఎంపీ, బీజేపీ నేత విజయశాంతి మరోసారి విమర్శలు గుప్పించారు. తెలంగాణ సర్కార్ ప్రభుత్వ భూములను అమ్మాలని నిర్ణయించిన నేపథ్యంలో విజయశాంతి స్పందించారు. రాష్ట్రంలో ప్రభుత్వ భూములను అమ్మి ఎలాగైనా వేల కోట్ల రూపాయలు ఆదాయాన్ని సమకూర్చుకోవడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఆగమేఘాల మీద ఉరుకులు పరుగులు పెడుతోందని విమర్శించారు. ధనిక రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన సీఎం కేసీఆర్ … నేడు భావితరాల ప్రయోజనాల కోసం రాష్ట్రంలో సర్కారు భూమి అన్నదే లేకుండా చేసేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.


అత్యంత కీలకమైన ప్రభుత్వ భూములను పెద్ద మొత్తంలో అమ్మేసి, రాష్ట్రాన్ని ప్రైవేటీకరించడమే తెలంగాణ సర్కారు లక్ష్యంగా కనిపిస్తోందని విజయశాంతి ఆరోపించారు. ప్రభుత్వ భూముల అమ్మకాలపై మంత్రి హరీష్‌ రావు స్పందించిన తీరును కూడా విజయశాంతి తప్పుబట్టారు. గత ప్రభుత్వాలు భూములు అమ్మగా లేనిది… తమ ప్రభుత్వం అదే పని చేస్తే తప్పా? అని హరీష్‌ రావు చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసారు. గత ప్రభుత్వాలు చేసిన తప్పును ఆనాడు అన్ని వర్గాలు ఎండగట్టాయని.. కానీ అదే తప్పు టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తే అదేలా సరైన నిర్ణయమని ఆమె ప్రశ్నించారు.

తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థతో పాటు విద్యా రంగ వ్యవస్థ కూడా కుప్పకూలుతుందని విజయశాంతి ఆవేదన వ్యక్తం చేసారు. మొన్నటి వరకూ రాష్ట్రంలోని వర్సిటీలకు వీసీలు లేక వ్యవస్థ గాడి తప్పిందని, దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి స్వయంగా గవర్నరే ఘాటుగా లేఖ రాసే పరిస్థితి వచ్చిందని గుర్తు చేసారు. అయితే తాజాగా ఈ వర్శిటీలలో ప్రొఫెసర్ల కొరత తీవ్రంగా వేధిస్తోందని అన్నారు. వర్శిటీలలో దాదాపు 3 వంతుల పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే విద్యా వ్యవస్థను కేసీఆర్ సర్కారు ఎంతగా దిగజార్చిందో అర్థం చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. సుమారు వెయ్యికి పైగా ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్ళ కిందటే నిర్ణయం తీసుకున్నప్పటికీ ఇప్పటికీ భర్తీ చేయలేదని మండిపడ్డారు.