ఎన్నాళ్లు ఈ ‘పోడు’ చిచ్చు.. ఎఫ్ఆర్ఓ హత్య బాధ్యత ఎవరిపై!

తెలంగాణ రాష్ట్రంలో ఏళ్ల తరబడి పరిష్కారం కాని సమస్య ఏదైనా ఉందంటే..అది పోడు భూముల సమస్య. ఏజెన్సీ ప్రాంతాల్లోని పోడు భూములని ఆదివాసీలు, గిరిజన్లు, గుత్తికోయిల..ఇలా గిరిజన జాతుల వారు సాగు చేసుకుంటున్నారు. ఇక ప్రభుత్వాలు ఏమో పోడు భూముల సాగుకు అనుమతి లేదని చెప్పి..అధికారుల చేత దాడులు చేయిస్తారు. అయితే ఎన్నికల సమయంలో మాత్రం పోడు భూముల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి..ఆదివాసీలు, గిరిజనుల ఓట్లని వేయించుకుంటారు.

గత రెండు సార్లు అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ సర్కార్ కూడా పోడు భూములకు పట్టల పేరిట వారి ఓట్లు కొల్లగొట్టిందే. ఇప్పటికే పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనులపై ఫారెస్ట్ అధికారుల దాడులు పెరిగాయి. అటు గిరిజన్లు సైతం అధికారులపై తిరగబడుతున్నారు. ఇదే క్రమంలో కమ్యూనిస్టులతో పొత్తు, గిరిజనుల ఓట్ల కోసం మళ్ళీ కేసీఆర్ సర్కార్.. పోడు భూముల సమస్యలని పరిష్కరిస్తామని చెప్పి..పోడు సర్వే నిర్వహిస్తోంది.

ఇదే సమయంలో ఊహించని విధంగా చోటు చేసుకున్న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు హత్య ఇప్పుడు గిరిజన గూడేల్లో ఆందోళనకు కారణంగా మారింది. జండాల పాడు అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులు వేసిన ప్లాంటేషన్‌ను తొలగించి గుత్తికోయలు పోడు వ్యవసాయం చేయాలని ప్రయత్నిస్తున్న క్రమంలో, వారిని అడ్డుకున్న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావును గుత్తికోయలు అతి దారుణంగా పదునైన ఆయుధాలతో దాడి చేసి హతమార్చారు. అటు సహాయ సిబ్బందిగా ఉన్న రామారావుని సైతం హత్య చేశారు.

దీనిపై సర్కార్ సీరియస్ అయింది..దొషులకు కఠిన శిక్ష వేయాలని సూచించింది. అటు కేసీఆర్.. మరణించిన అధికారికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మంత్రులు వెళ్ళి.. ఫారెస్ట్ అధికారి పాడే మోశారు. అయితే గుత్తికోయలు ఇంతటి దారుణానికి పాల్పడడం అందరినీ షాక్ గురిచేసింది. కానీ ఇదే అంశం యావత్ గుత్తి కోయ సమాజానికి మాత్రం ఇది పెను ప్రమాదంగా పరిణమించింది. అయితే అధికారి హత్య అనేది దారుణమైన అంశం.. కానీ ఇన్నేళ్లు అధికారులు సైతం.. పోడు వ్యవసాయం చేసుకునేవారిపై దాడులు చేశారు. ఇలా అధికారులు, పోడు వ్యవసాయం చేసుకునే వారి మధ్య పోరు నడుస్తూనే ఉంది. కానీ ఈ సమస్యలని పరిష్కరించాల్సిన ప్రభుత్వం మాత్రం ఇంతకాలం చోద్యం చూస్తూ వచ్చింది. ఇప్పుడు ఏదో పోడు సర్వేలు అంటూ హడావిడి చేస్తున్నారు. అయితే ఇంతకాలం సమస్యలు పరిష్కరించకుండా పోడు చిచ్చు పెట్టింది ప్రభుత్వమే అని విమర్శలు వస్తున్నాయి. ఫారెస్ట్ అధికారి హత్యకు బాధ్యత వహించాల్సింది కూడా ప్రభుత్వమే అని ప్రతిపక్షాలు ఫైర్ అవుతున్నాయి.