ఎచ్చెర్లలో కమలం వికసిస్తుందా…..?

-

శ్రీకాకుళం జిల్లాలో అందరి దృష్టి ఆ నియోజకవర్గంపైనే పడింది. నిన్న మొన్నటి వరకూ పరిశీలనలో కూడా లేని బీజేపీ అభ్యర్ధి కూటమి పార్టీల తరఫున పోటీలోకి దిగుతున్నారు. దీంతో టీడీపీ టికెట్ అశించిన సీనియర్లు కంగుతిన్నారు. సామాజిక బలం లేకపోయినా కమలం పార్టీ అభ్యర్ధి గెలుపుపై ధీమా వ్యక్తం చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇది టీడీపీకి పట్టున్న స్థానం. కానీ టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా ఎచ్చెర్ల నుంచి కమలం పార్టీ పోటీ చేస్త్తోంది. ఆ పార్టీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు నడికుదిటి ఈశ్వరరావును అభ్యర్థిగా బరిలో దింపుతోంది. దీంతో నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. నియోజకవర్గం ఆవిర్భావం నుంచి బీజేపీ జెండా ఎలా ఉంటుందో తెలియని ఎచ్చెర్లలో ఈసారి కమలం పార్టీ పోటీ చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

వాస్తవానికి కూటమి పార్టీల పొత్తు తర్వాత ఎచ్చెర్ల ఎవరికి కేటాయించాలన్న అంశంపై మూడు పక్షాలు సీరియస్‌గా కసరత్తు చేశాయి. టీడీపీ ఇన్‌చార్జ్‌, మాజీ మంత్రి కళా వెంకట్రావుతో పాటు కలిశెట్టి అప్పలనాయుడు కూడా సీటు ఆశించారు. ఈ ఇద్దరు నేతల్లో ఒకరికి ఎచ్చెర్ల టికెట్ ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది. కానీ సీట్ల సర్దుబాటులో భాగంగా బీజేపీ ఈ స్థానాన్ని ఎంచుకుంది.

వాస్తవానికి ఎచ్చెర్ల నియోజకవర్గంలో కాపు సామాజికవర్గం ఓటర్లు అధికం. ఈ స్థానం నుంచి ఇప్పటివరకు అన్ని పార్టీలు కాపులనే బరిలో దించాయి. కానీ ఈసారి కమ్మ సామాజికవర్గ నేత నడికుదిటి ఈశ్వరరావు.. అలియాస్‌ ఎన్‌ఈఆర్‌.. పోటీ చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఈ కమ్యూనిటీ ఓటర్లు చాలా తక్కువ. కానీ సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా గుర్తింపు పొందిన ఈ నేతను బరిలో దింపటం హాట్ టాపిక్‌గా మారింది.

మరోవైపు ఎచ్చెర్లలో బీజేపీ గెలుపు ఒక పెద్ద సవాల్ అనే చెప్పాలి. ఇక్కడి నుంచి టికెట్ ఆశించిన మాజీ మంత్రి కళా వెంకట్రావుకు ఈ ప్రాంతంపై గట్టి పట్టుంది. టీడీపీ టికెట్ ఆశించి భంగపడిన కలిశెట్టి అప్పలనాయుడు నిరాశలో ఉన్నారు. ఈ పరిస్ధితుల్లో వీరి సహకారం లేనిదే ఎచ్చెర్లలో బీజేపీ అభ్యర్ధి నెట్టుకు రావటం అంత ఈజీ కాదనే వాదనలు ఉన్నాయి. టికెట్ ఆశించిన కళా వెంకట్రావుకు టీడీపీ నాయకత్వం ఇప్పుడు విజయనగరం జిల్లా చీపురుపల్లి సీటు కేటాయించింది. అక్కడ మంత్రి బొత్స సత్యనారాయణతో కళా పోటీ పడాల్సి ఉంది. దీంతో ఎచ్చెర్ల బీజేపీ అభ్యర్థికి ఈ నేత నుంచి పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు. మరో నాయకుడు కలిశెట్టి అప్పలనాయుడుకు అనూహ్యంగా విజయనగరం పార్లమెంట్ అభ్యర్థిగా ఎంపిక చేశారు చంద్రబాబు. ఈ పరిస్ధితుల్లో టీడీపీ క్యాడర్ కమలంతో కలిసి పని చేస్తాస్తుందా..? లేదా..? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు కలిశెట్టి స్వతంత్రంగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కలిశెట్టి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగితే.. కూటమి పార్టీల ఓటు బ్యాంక్‌ చీలిపోయే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఈశ్వరరావు గతంలో మాజీ మంత్రి కళా వెంకట్రావుకు ప్రధాన అనుచరుడిగా ఉండేవారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నేత వేధింపులకు గురయ్యారు. అనంతరం చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల్లో బీజేపీలో చేరారు. ఆ తర్వాత కొద్ది రోజులకే విజయనగరం జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. అప్పటి నుంచి ఎన్.ఈ.ఆర్ ఎచ్చెర్ల సీటుపై కన్నేశారు. నియోజకవర్గంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పక్కా ప్లాన్ తో అసెంబ్లీ బరిలో దిగుతున్న ఈశ్వరరావు ఈ ప్రతికూల పరిస్ధితులను ఎలా అధిగమిస్తారు.. అనే అంశం చర్చనీయాంశంగా మారింది. భవిష్యత్‌ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.

Read more RELATED
Recommended to you

Exit mobile version