పెద్దల సభకు వైఎస్సార్ ఫ్రెండు వెళ్లాలని ఉవ్విళ్లూరుతున్నారు. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో అనూహ్యంగా కొందరి పేర్లు వస్తున్నాయి. అందులో ఆర్.కృష్ణయ్య ఒకరు. ఆయన పేరు కూడా వినిపిస్తోంది. బీసీ నేతగా ఉమ్మడి రాష్ట్రంలో సుపరిచితులు అయిన ఆయన పెద్దలసభకు వెళ్లేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. అయితే వీరికి అవకాశాలు ఏ మేరకు ఉన్నాయో కూడా తేలడం లేదు. ఇదే రాజ్యసభకు సంబంధించి వైసీపీకి నాలుగు సీట్లు మాత్రమే ఉన్నాయి. వాటిలో ఒకటి ఎప్పుడో కన్ఫం అయింది.
అదే సాయిరెడ్డి ప్లేస్. మరో ప్లేస్ ను ప్రీతీ అదానీ (ప్రముఖ వ్యాపార దిగ్గజం గౌతమ్ అదానీ జీవన సహచరి) పేరు కూడా కన్ఫం అయింది. ఓ సందర్భంలో సినీ నటుడు అలీకి రాజ్యసభ సీటు ఖాయం అని అనుకున్నారు కానీ అది కూడా జరిగే పని కాదని తేలిపోయింది. నెల్లూరు నేతల కోటాలో బీద మస్తాన్ రావు కు కేటాయించాలని యోచిస్తున్నారు. ఇది కూడా ఇంకా కన్ఫం కాలేదు.
ఇక మహిళల కోటాలో కిల్లి కృపారాణి పేరు బలీయంగా అప్పట్లో వినిపించింది కానీ ఈ పేరు కూడా కన్ఫం కాలేదు. రాజ్యసభకు సంబంధించి విపరీతం అయిన పోటీ నెలకొనడంతో ఎవరు పేరు ఎప్పుడు వినిపిస్తుందో ఎవరికి ఆ అదృష్టం వరిస్తుందో చెప్పలేం.
ఇప్పటికే చాలా మంది ఆశావహులు సీఎంను కలిసి తమ విన్నపాలు చెప్పి వెళ్లారు. విడదల రజని (వైద్యారోగ్య శాఖ మంత్రి, ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం చిలకలూరి పేట ) కోసం సీటు త్యాగం చేసిన మర్రి రాజశేఖర్ కూడా రాజ్యసభ సీటు కావాలని ఎప్పటి నుంచో పట్టుబడుతున్నారు. మరి! ఆయనకు అదృష్టం వరిస్తుందో లేదో అన్నది కూడా ఇప్పటికిప్పుడు తేలని విషయమే ! ఇదే సందర్భంలో జగన్ కేసులను వాదించిన ఆయన తరఫు న్యాయవాది నిరంజన్ రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది.
ఆయన కూడా పెద్దల సభకు వెళ్లాలని యోచిస్తున్నారు. ఓ సందర్భంలో ఇద్దరు రెడ్డి సామాజికవర్గ నేతలను పంపే వీలు లేదు కనుక ఈయన పేరు ఫిక్స్ చేసి సాయిరెడ్డిని తప్పించినా తప్పించవచ్చు అని కూడా వార్తలున్నాయి. సాయిరెడ్డి ప్లేస్ ను సజ్జలతో రీప్లేస్ చేయాలని కూడా భావించారు. అవేవీ ఇంకా ఓ కొలిక్కి రాలేదు.