కుప్పంని కప్పేస్తున్న ఫ్యాన్స్..!

175కి 175 సీట్లు గెలుచుకోవాలని టార్గెట్ పెట్టుకున్న జగన్..ఆ టార్గెట్‌ని చేరుకోవడమే లక్ష్యంగా రాజకీయం మొదలుపెట్టారు. కుప్పం నుంచే జనంలోకి వెళ్ళే కార్యక్రమాలు మొదలుపెట్టనున్నారు. ఈ నెల 23న కుప్పం టూరుకు వెళ్లనున్నారు. మొదట 22న కుప్పం వస్తారని చెప్పారు గాని..కొన్ని కారణాల వల్ల పర్యటనని 23కి వాయిదా వేసుకున్నారు. ఇక యథావిధిగానే కుప్పంలో కార్యక్రమాలు జరగనున్నాయి.

అయితే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కుప్పంని టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. ఈ సారి ఎలాగైనా కుప్పంలో చంద్రబాబుని ఓడించడమే లక్ష్యంగా జగన్ పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి..కుప్పంపై ఫోకస్ చేసి పనిచేస్తున్నారు. కుప్పంలోని టీడీపీ శ్రేణులని వైసీపీలోకి లాగేస్తున్నారు. అలాగే లోకల్ ఎన్నికల్లో వైసీపీని వన్ సైడ్ గా గెలిపించారు. కుప్పం మున్సిపాలిటీని కైవసం చేసుకున్నారు.

దీంతో కుప్పం అసెంబ్లీ కూడా గెలుస్తామని వైసీపీ నేతలు సవాళ్ళు చేస్తున్నారు. ఇదే క్రమంలో బాబు కూడా అలెర్ట్ అయ్యి..వీలు కుదిరినప్పుడల్లా కుప్పం వెళ్ళి..అక్కడ పార్టీ పరిస్తితులని సరి చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు కుప్పం వెళ్లారు. ఇటీవల కూడా కుప్పం వెళితే అక్కడ టీడీపీ-వైసీపీ శ్రేణుల మధ్య పెద్ద రచ్చ జరిగింది. ఇదే క్రమంలో జగన్ కుప్పం టూరు పెట్టుకున్నారు. అక్కడ మరింతగా వైసీపీ బలపడేలా ప్రణాళికలు రెడీ చేస్తున్నారు. జగన్ టూర్ నేపథ్యంలో కుప్పంలో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు మకాం వేశారు. పూర్తిగా వైసీపీ శ్రేణులతో కుప్పం నిండిపోయేలా ప్లాన్ చేస్తున్నారు.

ఇక ఎటు చూసిన జగన్‌కు వెల్కం బ్యానర్లు కనిపిస్తున్నాయి. అలాగే జగన్ పర్యటనలో భారీ స్థాయిలో టీడీపీ నుంచి వైసీపీలోకి వలసలు జరిగేలా ప్లాన్ చేస్తున్నారు. జగన్ పర్యటనతో కుప్పంలో వైసీపీకి ఇంకా ఊపు తీసుకురావాలని చూస్తున్నారు. ఈ విధంగా వైసీపీ..కుప్పం టార్గెట్ గా రాజకీయం నడిపిస్తుంది. మరి చివరికి కుప్పంని వైసీపీ కైవసం చేసుకుంటుందో లేదో చూడాలి.