బెజవాడకి తగిలిన ఎన్నికల సెగ..ప్యూహలకు పదును పెడుతున్న వైసీపీ

-

కరోనా టైమ్‌లో స్థానిక ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ రాష్ట్ర ప్రభుత్వం మధ్య రగడ జరుగుతున్న సమయంలో బెజవాడలోని అధికార పార్టీ నాయకులకు మున్సిపల్‌ కార్పొరేషన్‌ సమరం గుబులు రేపుతోందట. స్థానిక ఎన్నికల తర్వాత విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌ ఎన్నికలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చే వీలుంది. దీంతో గత ఎన్నికల ఫలితాలను.. ఇప్పుడు ఎదురయ్యే సవాళ్లను దగ్గర పెట్టుకుని భవిష్యత్‌ రాజకీయ కార్యాచరణపై ఫోకస్‌ పెట్టారట వైసీపీ నేతలు.

2014లో జరిగిన విజయవాడ మున్సిపల్‌ మేయర్‌ పీఠాన్ని టీడీపీ కైవశం చేసుకుంది. నాడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నా.. ఒంటరిగానే 34 డివిజన్లు గెలిచి పాగా వేసింది తెలుగుదేశం. ఆ సమయంలో బెజవాడలో ఉన్న 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు ఉండగా.. ఇప్పుడు ఒక్క తూర్పు నియోజకవర్గానికి మాత్రమే టీడీపీ ఎమ్మెల్యే ఉన్నారు. అప్పట్లో వైసీపీ 19 స్థానాలకే పరిమితమైంది.

గత ఎన్నికల సమయానికి బెజవాడలో 59 డివిజన్లు ఉన్నాయి. తూర్పు నియోజకవర్గ పరిధిలో 20 డివిజన్లు ఉండగా 9 చోటల్ వైసీపీ పాగా వేసింది. సెంట్రల్‌ నియోజకవర్గంలో 20 డివిజన్లకు గాను 3 చోట్లే గెలిచింది. పశ్చిమ నియోజకవర్గంలోని 19 డివిజన్లలో ఏడుచోట్ల విజయం సాధించింది. ఇప్పుడు బెజవాడలోని డివిజన్ల సంఖ్య 59 నుంచి 64కు పెరిగింది. దీంతో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తన నియోజకవర్గం నుంచి ఎక్కువ మందిని గెలిపించి మేయర్‌ సీటును తన వర్గానికి ఇప్పించుకోవాలనే ఆలోచనలో ఉన్నారట. సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కూడా అత్యధిక సీట్లు గెలిపించుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నారట.

కొత్తగా పార్టీలోకి వచ్చి తూర్పు నియోజకవర్గ బాధ్యతలు తీసుకున్న దేవినేని అవినాష్‌ సైతం తన బలం నిరూపించుకోవాలని చూస్తున్నారట. ఈసారి మేయర్‌ సీటు గెలవాలంటే 33 డివిజన్లలో గెలుపొందాలి. అంటే గతంలో వచ్చిన 19 డివిజన్లకు అదనంగా 14 చోట్ల పాగా వేయాలి. ఈ మధ్య కాలంలో బెజవాడలో దుర్గగుడి ఫ్లైఓవర్‌ ప్రారంభించారు. అంతకుముందు బెంజిసర్కిల్ ఫ్లైఓవర్‌ ఓపెన్‌ చేశారు. ఈ రెండు కూడా నగర ఓటర్ల పై ప్రభావం చూపుతాయని.. ఆ ఓట్లు ఏ పార్టీ ఖాతాలో పడతాయోనని లెక్కలు వేసుకుంటున్నారట. అలాగే ఈ దఫా విజయవాడ మున్సిపల్‌ ఎన్నికల్లో జనసేన పాత్ర కూడా కీలకం కానుంది.

బీజేపీ జనసేన కలిసి బరిలో దిగితే ఓట్లు చీలతాయని.. దానికి తగ్గట్టుగానే ఎన్నికల వ్యూహం ఉండాలని భావిస్తున్నారట అధికార పార్టీ నాయకులు. పైగా టీడీపీ కూడా రాజధాని అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఓట్లు అభ్యర్ధించే వీలుంది. అందుకే ఎలాంటి ఛాన్స్‌ తీసుకోకూడదని అనుకుంటున్నారట వైసీపీ నేతలు. దీంతో అధికార పార్టీ నేతల్లో బెజవాడ ఫీవర్‌ పట్టుకుందనే చర్చ మొదలైంది.

Read more RELATED
Recommended to you

Latest news