భూకబ్జాల ఆరోపణల నేపథ్యంలో మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్ శనివారం తన ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేసిన విషయం తెల్సిందే. ఈటల అసెంబ్లీ కార్యదర్శికి తన రాజీనామా లేఖను అందజేశారు. ఈటల రాజీనామాకు అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆమోదం కూడా తెలిపారు. ఇందంతా గంటల వ్యవధిలో జరిగిపోయింది. అయితే ఈటల రాజీనామా నేపథ్యంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ కొత్త డిమాండ్ తెర మీదకు తీసుకొచ్చారు.
పార్టీ మారుతున్న ఈటల నైతిక బాధ్యత వహిస్తూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని, మరి కాంగ్రెస్ నుంచి అధికార టీఆర్ఎస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యేలు కూడా ఇదే తరహాలో నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేసారు. అలా కాకుంటే సీఎం కేసీఆర్ నే వారితో రాజీనామా చేయించి విలువలకు కట్టుబడాలని పొన్నం పేర్కొన్నారు.