దేశ ప్రథమ మహిళగా త్వరలోనే గిరిజన సంతతి కి చెందిన సంథాలి తెగకు చెందిన తూర్పు ఆదివాసీ మహిళ అయిన ద్రౌపదీ ముర్మూకు దక్కనుంది. ఆమె ఎంపికతో తూర్పు ప్రాంత బిడ్డలకు ఓ మంచి అవకాశం బీజేపీ ఇచ్చిందనే చెప్పవచ్చు అని విశ్లేషకులు అంటున్నారు. ఉత్తరాది స్వరం బాగా వినిపిస్తున్న తరుణాన తూర్పు ఆదివాసీ బిడ్డకు మంచి ప్రాధాన్యం ఇచ్చి, తద్వారా దేశం దృష్టిని ఆకర్షించారు మోడీ. దేశ జనాభాలో ఎనిమిది శాతం ఉన్న గిరిజనుల దృష్టిని ఆకర్షించడమే కాదు, స్వతంత్ర భారతావనిలో ఇప్పటిదాకా ఎవ్వరూ చేయని విధంగా ఆమె పేరు తెరపైకి తీసుకువచ్చి ఓ చరిత్రకు తాము శ్రీకారం దిద్దామని ఎన్డీఏ పక్షాలు గర్వంగా చెప్పుకుంటున్నాయి.
ఆ విధంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీకి మరోసారి ఖ్యాతి దక్కనుందని సంబరపడుతున్నా యి. ముఖ్యంగాఇదే రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఇరవై పేర్లు వినిపించాయి. ఓ దశలో అజిత్ దోవల్ లాంటి ఉన్నతాధికారుల పేర్లు కూడా వినిపించాయి. తెలుగుదేశం పార్టీ ఆశించిన విధంగా వెంకయ్య నాయుడు పేరు కూడా వినిపించడం కొంత ఆశ్చర్యకరం. ఎందుకంటే ఏ మాత్రం ఆశల్లేని వ్యక్తి పేరు తెరపైకి తె చ్చి నిన్నంతా సోమిరెడ్డి తదిరత వ్యక్తులు కొంత హడావుడి చేసి ఉండవచ్చు కానీ అవేవీ నెగ్గే పనులు కావని సీనియర్ జర్నలిస్టులు అంటున్నారు.
ఏదేమయినప్పటికీ ఈ ఎన్నికతో ఒడిశా అన్నది దేశ రాజకీయాల్లో మరింత కీలకం కానుంది. తద్వారా ఆదివాసీల దృష్టి మరింతగా, మద్దతు ఇంకాస్త ఎక్కువగా బీజేపీకి ఉండనుందని తేలిపోయింది. ఇదే సమయాన మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తికి ఉప రాష్ట్రపతి పదవి ఇవ్వాలని యోచిస్తున్నారు.
ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి రాష్ట్రపతి ఎన్నికపై వైసీపీ ప్రభావం కొంత ఉన్నందున చర్చ అయితే నడుస్తోంది. ఎందుకంటే వైసీపీ బలం 4.22 శాతం. 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు (లోక్ సభలో) ఉన్నారు. అదేవిధంగా టీడీపీ బలం కేవలం 0.6శాతంగానే ఉంది. కనుక ఈ ఎన్నికల్లో వైసీపీ ప్రభావం చాలానే ఉండనుంది. కానీ రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో బీజేపీకి ఎటువంటి షరతులు లేకుండానే వైసీపీ మద్దతు ఇవ్వడం గమనార్హం. హోదాకు సంబంధించి కానీ విభజన చట్టం అమలుకు కానీ పట్టుబట్టకపోవడమే విశేషం. కాదు విచారకరం.