ఏపీలో ఆస్తిపన్ను భారీగా పెరుగుతుంది ఇప్పటి వరకు ఏడాదిలో వసూలు చేసే అద్దెని ప్రాతిపదికగా చేసుకుని ఆస్తి పన్ను నిర్ధారించేవారు. కానీ ఇప్పుడు ఆస్తి విలువను ప్రాతిపదికగా చేసుకుని పన్ను నిర్ధారించనున్నారు. ఈ మేరకు చేసిన సవరణకు గవర్నర్ ఆమోదం తెలపడంతో ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఏపీలో ఆర్ధిక వ్యవస్థ గాడిలో పెట్టడానికి వీలు ఉన్నంతవరకు పన్నులు వేస్తూ ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం తాజాగా మరో నిర్ణయం తీసుకుంది.
2021-22 ఆర్ధిక సంవత్సరం నుంచి ఆస్థి పన్నును రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా నిర్ధారించనున్నారు. దీంతో రిజిస్ట్రేషన్ విలువలను సవరించిన ప్రతీసారీ ఆ మేరకు ఆస్తి పన్ను కూడా పెరగనుంది. ప్రస్తుత విధానం కంటే కొత్త విధానంలో ఆస్థి పన్ను కనీసం పది శాతం కంటే ఎక్కువ ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. ఆస్తి విలువ ఖరారు చేసేందుకు భవనాలను నిర్మాణ శైలి ఆధారంగా వర్గీకరించారు. ఆర్ సీసీ, పెంకులు, రేకులు, నాపరాళ్లు, పూరిళ్ల వంటి ఆధారంగా ఆస్తిపన్ను విధించనున్నారు. ఆస్తి పన్ను నిర్ధారణలో అక్రమ కట్టడాలకు 25 నుంచి 100 శాతం వరకూ జరిమానా విధించనున్నారు.