చంద్రబాబుకి‌ షాకిచ్చిన తెలుగు తమ్ముళ్లు

-

టీడీపీ అధినేత చంద్రబాబు ఒకటి తలిస్తే తెలుగు తమ్ముళ్లు మరోకటి తలుస్తున్నారు. కుప్పం పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను వైసీపీకి కట్టబెట్టిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పుంగనూరులో షాక్‌ ఇవ్వాలని చంద్రబాబు అనుకున్నారట. ఆ మేరకు పుంగనూరులోని లోకల్‌ టీడీపీ లీడర్లకు ఆయన దిశానిర్దేశం చేశారట. కానీ పుంగనూరు తమ్ముళ్లు మరొకటి చేశారు. దీంతో మున్సిపల్‌ ఎన్నికల్లో పార్టీ అధినేత అనుకున్నదొక్కటీ అయ్యిందొక్కటి అని టీడీపీ శిబిరం మదన పడుతోందట.

పుంగనూరు మంత్రి పెద్దిరెడ్డికి రాజకీయ అడ్డా. ఆయన కనుసైగతో శాసిస్తారు. అయితే కుప్పం పంచాయతీ ఫలితాల తర్వాత పుంగనూరులోనే మంత్రికి ఝలక్‌ ఇవ్వాలని ప్లాన్‌ వేశారట టీడీపీ అధినేత. మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగరేయాలని సూచించారట. ఇంతలో పుంగనూరు నామినేషన్ల ఘట్టంలో అవకతవకలు జరిగాయని ఎస్ఈసీ కి టీడీపీ ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న ఎస్ఈసీ మున్సిపాలిటీలోని 31 వార్డుల్లో మూడు వార్డుల్లో తిరిగి నామినేషన్లు వేయడానికి అవకాశం ఇచ్చింది. అక్కడ టీడీపీ బలంగా ఉందని.. అభ్యర్థులను బరిలో దించి మంత్రిపై ప్రతికారం తీర్చుకోవాలని పార్టీ ఆఫీస్‌ నుంచి ఆదేశాలు వెళ్లాయట.

ఈ ఆదేశాల వరకు బాగానే ఉన్నా.. పుంగనూరు తెలుగు తమ్ముళ్లు మాత్రం తూచ్‌ అనేశారు. నామినేషన్లు వేయడానికి అవకాశం ఇచ్చిన మూడు చోట్లా దూరంగా ఉండిపోయారు. దీనిపై రాజకీయ రగడ మొదలైంది. నామినేషన్లు వేయకపోవడానికి అధికార పార్టీ కారణమని ఒకరంటే.. మొత్తం 31 వార్డుల్లో నామినేషన్లు వేయడానికి అనుమతి కోరితే కేవలం 3 వార్డుల్లోకే పర్మిషన్‌ ఇచ్చారని.. దానివల్ల ప్రయోజనం లేక తప్పుకొన్నట్టు టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. దీంతో ఇప్పటికే 108 పంచాయతీలను ఏకగ్రీవంగా చేసుకున్న వైసీపీ.. ఇప్పుడు మొత్తం మున్సిపాలిటీలోని 31 వార్డులను వశం చేసుకుంది.

ఈ పరిణామాలపై జిల్లా రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. పుంగనూరులో టీడీపీ బలంగా ఉన్నా.. నేతల తీరువల్లే ఇలా జరిగిందని చెవులు కొరుక్కుంటున్నారట. వైసీపీ కేడర్‌ మాత్రం సామాజిక మాధ్యమాల్లో ఒక ఆట ఆడుకుంటోంది. పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేయడానికి పుంగనూరులో టీడీపీకి అభ్యర్థులే లేరని సెటైర్లు వేస్తోంది. దీనికితోడు రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ పోటీకి దూరంగా ఉంటామని చెప్పడంపైనా టీడీపీలో తీవ్ర చర్చ జరుగుతోందట. పైగా.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తేల్చుకుంటామని ప్రకటించడం మరిన్ని విమర్శలకు దారితీస్తోంది.

ఇటీవల కుప్పంలో పర్యటించిన చంద్రబాబు.. మంత్రి పెద్దిరెడ్డిని లక్ష్యం చేసుకునే ప్రసంగాలు చేశారు. పుంగనూరులో తేల్చుకుందామని సవాల్‌ విసిరారు. కానీ… లోకల్‌ టీడీపీ నేతలు అధినేత మాటలను చెవికి ఎక్కించుకున్నట్టు లేరు. మరి.. ఎన్నికల్లో తమ్ముళ్లు కాడి పారేయడంపై చంద్రబాబు రియాక్షన్‌ ఎలా ఉంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news