కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సోమవారం నుండి అమెరికాలో పర్యటించనున్నారు. వాషింగ్టన్ డిసి, న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కోలో జరుగనున్న సమావేశాలకు ఆయన హాజరుకానున్నట్లు సంబందిత వర్గాలు తెలిపాయి. ఆయా నగరాల్లోని యూనివర్సిటీ విద్యార్థులతో చర్చిస్తారని, భారతీయ అమెరికన్లను ఉద్దేశించి ప్రసంగిస్తారని అన్నారు. అలాగే అమెరికా చట్టసభ సభ్యులతో సమావేశమవుతారని, థింక్ ట్యాంక్ సభ్యులు, వాల్ స్ట్రీట్ ఎగ్జిక్యూటివ్‌లు, యూనివర్సిటీ విద్యార్థులతో కూడా ఆయన చర్చలు జరుపుతారని ఆ వర్గాలు తెలిపాయి.
నేషనల్ హెరాల్డ్ కేసు విచారణ ఎదుర్కొంటున్న రాహుల్ గాంధీకి పదేళ్ల కాల పరిమితి ఉండే ఆర్డినరీ పాస్‌పోర్ట్ మంజూరుపై సుబ్రమణ్యస్వామి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక ఏడాది కాలానికే పాస్‌పోర్ట్ మంజూరు చేయాలని, అవసరం మేరకు దానిని మరో ఏడాదికి పొడిగించాలని ఢిల్లీ కోర్టును కోరారు. అయితే పదేళ్ల ఆర్డినరీ పాస్‌పోర్ట్ కోసం రాహుల్ గాంధీ తరుఫు న్యాయవాదులు కోర్టులో పట్టుబట్టారు. ఇరువైపు వాదనలు విన్న కోర్టు మూడేళ్ల గడువుతో కూడిన ఆర్డినరీ పాస్‌పోర్ట్‌పై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది. దీంతో తాత్కాలిక పాస్‌పోర్ట్ ఆయనకు లభించింది.