ఆలస్యంగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్

-

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మ్యాచ్ ప్రారంభానికి వర్షం ఆటంకం కలిగించింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఢిల్లీలో వర్షం పడడంతో గంట ఆలస్యంగా టాస్ వేశారు. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకుంది. బౌలింగ్ లో క్రమశిక్షణ లోపించిందని కెప్టెన్ డేవిడ్ వార్నర్ అంగీకరించాడు. ఈ లోపాన్ని చక్కదిద్దుకోవాల్సి ఉందని టాస్ సందర్భంగా వార్నర్ అభిప్రాయపడ్డాడు. మరోవైపు, రింకూ సింగ్, వెంకటేశ్ అయ్యర్, ఆండ్రీ రసెల్, కెప్టెన్ నితీశ్ రాణా వంటి హార్డ్ హిట్టర్లతో కోల్ కతా నైట్ రైడర్స్ పటిష్ఠంగా ఉంది. ఇక, బంగ్లాదేశ్ స్టార్ బ్యాట్స్ మన్ లిట్టన్ దాస్ ఈ మ్యాచ్ ద్వారా ఐపీఎల్ అరంగేట్రం చేస్తున్నాడు. లిట్టన్ దాస్ కోల్ కతా జట్టులో ఓపెనర్ గా బరిలో దిగనున్నాడు.

Rain delays DC and KKR match toss

బౌలింగ్ లో శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి ఫర్వాలేదనిపిస్తున్నా… లాకీ ఫెర్గుసన్ విఫలమవుతుండడం కోల్ కతా జట్టుకు సమస్యగా మారింది. ఇవాళ్టి మ్యాచ్ లో ఓపెనర్ జగదీశన్ బదులు జాసన్ రాయ్ బరిలో దిగుతున్నాడు. లాకీ ఫెర్గుసన్ స్థానంలో కుల్వంత్ ఖెజ్రోలియాకు అవకాశం ఇచ్చారు. ఢిల్లీ జట్టులో ఫిలిప్ సాల్ట్ జట్టులోకి వచ్చాడు. సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ చాలా రోజుల తర్వాత మళ్లీ ఐపీఎల్ బరిలో దిగుతుండడం విశేషం. ఇషాంత్ శర్మ ఢిల్లీ జట్టులో ఆన్రిచ్ నోర్కియా, ముఖేశ్ కుమార్ తో కలిసి పేస్ బాధ్యతలు పంచుకోనున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు 5 మ్యాచ్ లు ఆడిన ఢిల్లీ జట్టు అన్నింట్లోనూ ఓడిపోయి పాయింట్ల పట్టికలో అట్టడుగున కొనసాగుతోంది. కనీసం ఈ మ్యాచ్ లోనైనా గెలిచి తీరాలని పట్టుదలగా ఉంది.

 

Read more RELATED
Recommended to you

Latest news