తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ ఈదురుగాలులతో వర్షం పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, సంగారెడ్డి, వరంగల్, భద్రాద్రి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని వెల్లడించింది.
హైదరాబాద్ నగరంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. కూకట్ పల్లి, చందానగర్, శేరిలింగంపల్లి, కేపీహెచ్ బీ, గాగిల్లాపూర్, మదీనాగూడ, మల్లంపేట్, నిజాంపేట్, గండిమైసమ్మ, కొండపూర్, హైదర్ నగర్, మియాపూర్ ప్రాంతాల్లో వర్షం కురిసింది. రోడ్లపైకి నీరు చేరడంతో వాహనదారులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. కాగా, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దీని ప్రభావంతో రాగల 48 గంటల్లో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.