ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ అదురగొడుతోంది. బంతితో బౌల్ట్, చాహల్, బర్గర్.. బ్యాట్ తో రియాన్ పరాగ్ చెలరేగడంతో ఆ జట్టు ముంబయి ఇండియన్స్ ని మట్టి కరిపించింది. వరుసగా మూడో విజయాన్ని రాజస్థాన్ రాయల్స్ ఖాతాలో వేసుకుంటే.. వరుసగా మూడో ఓటమిని ముంబయి జట్టు తమ ఖాతాలో వేసుకుంది. హార్ధిక్ పాండ్యా కెప్టెన్ గా వచ్చినప్పటి నుంచి ముంబయి జట్టుకు ఒక్క విజయం కూడా దక్కకపోవడంతో ముంబయి అభిమానులు కాస్త నిరాశకు గురవుతున్నారు.
ముంబై జట్టుకి తొలి 2 మ్యాచ్ లు ఇతర వేదికల్లో జరగ్గా.. తాజాగా సొంతగడ్డపై కూడా సత్తా చాటలేకపోయింది. బ్యాటర్లు విఫలం చెందడంతో మూడో ఓటమిని మూటగట్టుకుంది. తొలుత ముంబై 125 రన్స్ చేయగా.. రాజస్థాన్ 4 వికెట్లు కోల్పోయి మరో 27 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. రాజస్థాన్ రాయల్స్ యంగ్ బ్యాటర్ రియాన్ పరాగ్ (54) తన జట్టుకు విజయాన్ని అందించారు. ముంబై బౌలర్ ఆకాశ్ మద్వాల్ 3 వికెట్లు తీశారు. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి బ్యాటర్లు రోహిత్ శర్మ, నమద్, ఇంపాక్ట్ ప్లేయర్ బ్రేవిస్ కూడా ఏ మాత్రం ప్రభావం చూపకపోవడం గమనార్హం. హ్యాట్రిక్ విజయంతో రాజస్థాన్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది.