తెలంగాణ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా… గురువారం రాత్రి నుంచి శుక్రవారం రాత్రి వరకు భారీ వర్షం పడింది. అత్యధికంగా సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ లో 19 సెంటీమీటర్ల వర్షం కురిసింది. శుక్రవారం ఉదయం 8:30 నుంచి రాత్రి 10 గంటల వరకు సూర్యాపేట జిల్లా మునగాలలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. పల్లి జిల్లాల్లో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.
ఇక ఇవాళ రేపు కూడా తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా భారీ వర్షాలు నమోదు అవుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. గత రెండు రోజులుగా కుడుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయని… మరో రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని హెచ్చరించింది వాతావరణ శాఖ. కాబట్టి ప్రజలెవరు అత్యవసరం అయితే తప్ప బయటకి రాకూడదని కోరింది.
అటు హైదరాబాద్‌లో నిన్న రాత్రి భారీ వర్షం కురిసింది. రాత్రి 10 గంటల వరకు అత్యధికంగా రామంతాపూర్‌లో 4.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. మాదాపూర్‌లో 4.1, హఫీజ్‌పేట్‌లో 3.6, చార్మినార్‌లో 2.8, సరూర్‌నగర్, ఎల్బీనగర్‌లో 2.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. అటు జీహెచ్‌ఎంసీ అధికారులు కూడా రెడ్ అలర్ట్ ప్రకటించారు.