దేశంలో సైబర్ నేరాల తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతోంది. నేరాల తీవ్రతతో పాటు నేరాల సంఖ్య కూడా పెరిగిపోతోంది. దీంతో సంబంధిత నిఘా విభాగాలు పౌరులను జాగ్రత్తగా ఉండమని చెబుతున్నాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా గడిచిన మూడేళ్లలో 11 లక్షల కేసులు నమోదు అయ్యాయి అని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అంటున్నారు. వీటిలో సామాజిక మాధ్యమాలకు చెందినవే రెండు లక్షలకు పైగా ఉంటాయి అని కూడా అంటున్నారు. దీంతో సైబర్ నేరాలపై జాగ్రత్తగా ఉండాలని పదే పదే విన్నవిస్తున్నారాయన.
ఇటీవల కాలంలో ఆన్లైన్ గేమింగ్ కల్చర్ కారణంగా కూడా సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి.వీటిని నియంత్రించేందుకు జిల్లాల స్థాయిలో ఉన్న యంత్రాంగం, వారికి ఉన్న అవగాహన అంతంత మాత్రంగానే ఉంది. అదేవిధంగా ఆన్లైన్ లో మోసాలు ముఖ్యంగా ఆర్థిక లావాదేవీల పేరిట జరిగే మోసాలు వీటిని కట్టడి చేయడం పోలీసులకు పెను సవాలుగా ఉంది. ఫేక్ అకౌంట్ల ద్వారా సోషల్ మీడియాలో జరిగే ఫేక్ ప్రోపగాండ కూడా ప్రమాదకరం. వీటన్నింటిపై పౌరులు అవగాహన కల్పించుకుని తీరాలి. వెంటవెంటనే సంబంధిత నిఘా వర్గాలను కలిసి తమ గోడు చెప్పుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. అదేవిధంగా కంప్లైంట్ ఫైల్ చేసేందుకు సిద్ధ పడాలి.
ముఖ్యంగా సైబర్ నేరాలలో మహిళలకు వేధింపులు ఎక్కువ అవుతున్నాయి. ఇవే సైబర్ నేరాల్లో హనీ ట్రాప్ పేరిట యువతుల వలపు వలలు, తరువాత వేధింపులు ఇవి కూడా ఎక్కువ అవుతున్నాయి. వీటన్నింటినీ నియంత్రించే శక్తి పోలీసులకే కాదు పౌరులకూ ఉంది. ముఖ్యంగా డేటింగ్ యాప్స్ కు దూరంగా ఉండండి. మీ చిన్నారులు ఆన్లైన్ లో ఏ గేమింగ్ కల్చర్ కు అలవాటు పడి ఉన్నారో అన్నది గమనించండి. ముఖ్యంగా నెట్ యాక్సెస్ అన్నది వాళ్లకు ఎంత అవసరమో అంతవరకే ఇవ్వండి. లేదంటే మీరు చాలా చిక్కుల్లో పడతారు. ఇప్పటికే చాలా మంది చిన్నారులు వీటికి వ్యసనపరులుగా మారిపోయి తమకు తెలియకుండానే సమస్యల్లో ఇరుక్కుపోయి డబ్బులు పొగొట్టుకోవడమే కాదు మానసిక రుగ్మతలకూ బలైపోతున్నారు. చిన్నారుల నుంచి మహిళల వరకూ ఇవాళ చాలా మంది సైబర్ నేరగాళ్ల వలలో పడి డబ్బులు పోగొట్టుకోవడమే కాదు మనశ్శాంతి అన్నది లేకుండా జీవిస్తున్నారు.