తెలంగాణ కాంగ్రెస్ … టీటీడీపీలాగా అవుతుందా? రేవంత్ రెడ్డి పైకి లేపలేరా?

-

ఎట్టకేలకు టీపీసీసీ అధ్యక్షుడుని ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇన్నిరోజుల ఉత్కంఠకు తెరదించుతూ రేవంత్ రెడ్డి కి టీపీసీసీ పగ్గాలు అప్పగించారు. అయితే రేవంత్‌కు పీసీసీ ఇవ్వడంపై కాంగ్రెస్ పార్టీలోని ఓ వర్గం సంబరాలు చేసుకుంటుంటే, మరో వర్గం తీవ్ర అసంతృప్తితో ఉంది. ఇప్పటికే రేవంత్‌కు పీసీసీ ఇవ్వడంపై పలువురు సీనియర్లు అలకపాన్పు ఎక్కేశారు.

 

రేవంత్ రెడ్డి | Revanth Reddy

మరికొందరు రాజీనామాల బాటపట్టారు. ఈ క్రమంలోనే పీసీసీ ఇస్తారని ఎన్నో ఆశలు పెట్టుకున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం రేవంత్‌కు పీసీసీ ఇవ్వడంపై తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. అలాగే పరోక్షంగా రేవంత్‌పై విమర్శలు చేశారు. ఓటుకు నోటు మాదిరిగానే, నోటుకు పీసీసీ ఇచ్చారని మాట్లాడారు. ఇక టీటీడీపీ మాదిరిగానే, తెలంగాణలో కాంగ్రెస్ కూడా తయారవుతుందని అన్నారు. అంటే రేవంత్‌కు పీసీసీ ఇవ్వడం వల్ల, తెలంగాణలో కాంగ్రెస్ కూడా టీడీపీ లాగా కనుమరుగు కానుందని పరోక్షంగా విమర్శించారు.

దశాబ్దాల పాటు తెలంగాణలో ఒక వెలుగు వెలిగిన టీడీపీ ఇప్పుడు ఎలాంటి పరిస్తితుల్లో ఉందో అందరికీ తెలిసిందే.  రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్ దెబ్బకు తెలంగాణలో టీడీపీ కథ ముగిసింది. అయితే టీడీపీలో రాజకీయ భవిష్యత్ కష్టమని చెప్పి రేవంత్, ఆ పార్టీని వదిలి ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్‌లో చేరారు. తక్కువ సమయంలోనే కాంగ్రెస్‌లో రేవంత్ మంచి స్థానానికి చేరుకున్నారు. ఇప్పుడు పీసీసీ దక్కించుకున్నారు. రేవంత్‌కు పీసీసీ దక్కడంతో తెలంగాణలో కాంగ్రెస్ కూడా టీడీపీలాగానే అవుతుందని కోమటిరెడ్డి విమర్శిస్తున్నారు.

అంటే రేవంత్ వచ్చాకే కాంగ్రెస్ పరిస్తితి దిగజారిందనే స్థాయిలో మాట్లాడుతున్నారు. ఇప్పుడు పీసీసీ వచ్చాక పార్టీ మరింత దిగజారుతుందని అంటున్నారు. అయితే కోమటిరెడ్డి వ్యాఖ్యలు నిజమవుతాయో లేదో కాలమే నిర్ణయించాలి. మరి ఈలోపు పీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ ఎంతకష్టపడి పార్టీని పైకి తీసుకొస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news