అక్కడ జరిగే ఎన్నికల్లో బీజేపీకి కేసీఆర్‌ సపోర్ట్‌: రేవంత్‌

-

బీజేపీ, టీఆర్‌ఎస్‌ లోలోపల మద్దతు ఇచ్చుకుంటూ, బయట మాత్రం తిట్టుకుంటారని టీపీసీసీ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. ఆ రెండు పార్టీలు ప్రజలను మభ్యపెట్టి లబ్ధి పొందుతున్నాయని ఆయన పేర్కొన్నారు. దిల్లీ తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశతో రేవంత్‌ రెడ్డి మాట్లాడారు. త్వరలో జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డిని ఎన్నికల ఇన్‌చార్జ్‌గా నియమించారు. ఆ నియామకం వెనక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కీలకపాత్ర వహించారని రేవంత్‌ అన్నారు. తమిళనాడు ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పూర్తి మద్దతు ఇచ్చేందుకే కిషన్‌రెడ్డికి ఇన్‌చార్జ్‌ బాధ్యతలు అప్పగించారని పేర్కొన్నారు. తమిళనాడుకు తెలంగాణ నుంచి భారీగా నిధులు సైతం సమకూరుతున్నాయని అన్నారు.

ప్రధానితో ఒప్పందం..

దిల్లీకి వెళ్లినప్పుడు సీఎం కేసీఆర్‌ బీజేపీ పార్టీకి తన అండదండాలు ఉంటాయని ప్రధానితో ఒప్పదం కుదుర్చుకున్నారని వ్యాఖ్యానించారు. అందుకే బీజేపీకి టీఆర్‌ఎస్‌ మద్దతు ఇచ్చి ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తోందని ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్‌ మద్దతు నేపథ్యంలోనే తెలంగాణ ఇంటెలిజెన్స్‌ను తమిళనాడుకు పంపి బీజేపీకి చేదోడువాదోడుగా ఉంటున్నారని ఆరోపించారు.

భద్రత కావాలని వినతి..

తనకు కేంద్ర బలగాల రక్షణ కల్పించాలని కేంద్రమంత్రి అమిత్‌షాను రేవంత్‌ రెడ్డి కోరారు. గతేడాది మార్చినెలలో తెలంగాణ హైకోర్డు ఆదేశాల మేరకు హోంశాఖకు తన భద్రత కల్పించాలని కోరినా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదన్నారు. బ్లూస్టార్‌ ఆపరేషన్‌ చేసి తనను అంతమొందిస్తానని కేసీఆర్‌ గతంలో హెచ్చరించిన నేపథ్యంలో తనకు కేంద్ర బలగాల భద్రత కావాలని అమిత్‌షాకు ఇచ్చిన వినతిలో కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news