RRR Film : రెచ్చిపోయిన అభిమానులు.. థియేటర్ అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం.. ఎక్కడంటే?

-

ఓటీటీలు వచ్చిన తర్వాత జనం కాస్త బద్ధకించేశారన్న అభిప్రాయం చాలా సందర్భాల్లో కొందరు వ్యక్తం చేశారు. థియేటర్లలో సినిమా చూసే బదులు కొద్ది రోజులు ఆగితే ఎలాగూ ఓటీటీలోకి వస్తుందని అనుకుంటున్నట్లు తెలిపారు. కానీ, చాలా కాలం తర్వాత ఆ అభిప్రాయం తప్పని నిరూపితమయింది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చూసేందుకు అభిమానులు క్యూ కడుతున్నారు.

ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని సామాన్యుల నుంచి మొదలుకుని సినీ సెలబ్రిటీల వరకు ప్రతీ ఒక్కరు మందుకు వచ్చారు. ఈ క్రమంలోనే అభిమానులు వెండితెరపైన తమ అభిమాన కథానాయకుడిని చూసి హారతిలు పట్టడంతో పాటు బయట ఫ్లెక్సీ, పోస్టర్, కటౌట్లకు రకరకాల పద్ధతుల్లో ఆరాధిస్తుంటారు. అలా తమ అభిమానాన్ని చాటుకుంటారు. ఇది సహజమే. కానీ, ఇలా చేయడం వలన ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకుగాను థియేటర్ల యాజమాన్యాలు పలు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నాయి.

వెండితెరపైన పాలాభిషేకం చేయడం లేదా ఇతర పనులు చేయడం వలన రిపేర్ చేయించడం ఇబ్బందిగా మారుతుందని, మళ్లీ ఆర్థిక పరమైన సమస్య రాకుండా ఉండేందుకు గాను సిల్వర్ స్క్రీన్ ఎదుట మేకులు కొట్టిన చెక్కలు ఏర్పాటు చేశారు. అయితే, ఇటువంటి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ సినిమా ప్రదర్శితమవుతున్న సమయంలో మధ్యలో ఆగిపోతే మాత్రం అభిమానులకు ఆగ్రహం వచ్చేస్తుంటుంది. ఆ టైంలో ఎవరు చెప్పినా వారు వినే పరిస్థితులలో ఉండబోరు. మరీ ముఖ్యంగా ఫస్ట్ డే అటువంటి పరిస్థితి ఎదురయితే ఇబ్బందే. అటువంటి పరిస్థితి ‘ఆర్ఆర్ఆర్’ ఫిల్మ్ విషయంలోనూ జరిగింది.

ఏపీలోని విజయవాడ సిటీలోని అన్నపూర్ణ థియేటర్‌లో శుక్రవారం ‘ఆర్ఆర్ఆర్’ ఫిల్మ్ ప్రదర్శితమవుతున్న టైంలో టెక్నికల్ ఇష్యూ వలన కొద్ది సేపు సినిమా ఆగిపోయింది. దాంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టాకీసులోని ఫర్నీచర్‌తో పాటు ఇతర వస్తు సామగ్రిని ధ్వంసం చేశారు. థియేటర్ అద్దాలను పగులగొట్టారు. చిత్ర ప్రదర్శన సమయంలో మొదటి రోజు థియేటర్ యాజమాన్యం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని ఈ ఘటన ద్వారా అర్థం చేసుకోవాలని పలువురు సూచిస్తున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news