పల్నాడు పౌరుషానికి పేరు. రాజసానికి పేరు.. ఆ దారుల్లో నందమూరి కుటుంబ వారసులు..ఆ దారుల్లో చిరు ఇంటి నట వారసులు సందడి చేస్తున్నారు.ట్రిపుల్ ఆర్ విడుదలకు ముందే ఇరు కుటుంబాల అభిమానుల దోస్తీ ఇవాళ ఓ ప్రత్యేక రీతికి
తార్కాణం.
ఒక వైపు మెగాస్టార్ మరో వైపు నందమూరి ఫ్యామిలీ
రెండు కుటుంబాల అభిమానుల్లో ఆనందాలకు అవధి లేదు
ఆ అవధి ని నిర్ణయించడం కూడా కష్టమే!
తాజాగా పల్నాటి దారుల్లో ఏర్పాటయిన ఫ్లెక్సీలు
ఇవాళ ఇరు కుటుంబాల అభిమానులకో ప్రత్యేక ఆకర్షణ
సినిమా విజయ దుందుభి మోగించనుందని చెబుతూ
వీరంతా వేయి కళ్లతో విడుదలకు ఎదురు చూస్తున్న వైనం
మరో గొప్ప ఉద్వేగానికి సంకేతం
ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎదురు చూస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రాజమౌళి రూపుదిద్దిన ఈ సెల్యులాయిడ్ వండర్ ఈ నెల 25 వ తేదీన విడుదల కానుంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ మీద అందరికీ ఆశలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ సినిమా విడుదలకు మూడు రోజులు మాత్రమే ఉండటంతో రెండు తెలుగు రాష్ట్రాలలో…ఇరు హీరోల ఫ్యాన్స్ హల్ చల్ చేస్తున్నారు.
థియేటర్ల దగ్గర ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి పండగ వాతావరణాన్ని తలపించేలా ముందస్తు వేడుకలు ఎవరికి తోచిన రీతిలో వారు చేస్తున్నారు. అటు మెగా ఫ్యామిలీ, ఇటు నందమూరి ఫ్యామిలీ అభిమానులు పోటా పోటీగా తమ హీరోల కటౌట్లను ఏర్పాటు చేస్తున్నారు. పల్నాటి దారుల్లో సత్తెనపల్లిలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఒక్క గుంటూరు జిల్లాలోనే కాదు యావత్ ఆంధ్రా మరియు తెలంగాణ జిల్లాలలో రూపుదిద్దుకుంటున్న ఫ్లెక్సీలు విపరీతంగా సినీ అభిమానులను ఆకర్షిస్తున్నాయి.
ఇందులో భాగంగా అల్లూరి సీతారామరాజు గెటప్ లో రామ్ చరణ్, కొమురం భీం గెటప్ లో తారక్ కటౌట్ ను ఏర్పాటు చేశారు సత్తెనపల్లికి చెందిన మెగా మరియు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు. రెండు ఫ్యామిలీల హీరోలు ఉన్న ఫ్లెక్సీని ప్రింట్ చేయించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఒక ఫ్లెక్సీలో మెగా ఫ్యామిలీకి చెందిన పవన్ కళ్యాణ్, చిరంజీవి, చరణ్ ఫొటోలు ముద్రించగా, మరో ఫ్లెక్సీలో సీనియర్ ఎన్టీఆర్, బాలయ్య, ఎన్టీఆర్ ఫొటోలను ముద్రించి తమ అభిమానం చాటుకున్నారు.
ఒకే కటౌట్ లో రెండు ఫ్యామిలీ హీరోలు ఉండటం ఈ ఫ్లెక్సీ ప్రత్యేకత.దీంతో అటు నందమూరి కుటుంబ సభ్యుల అభిమానులనూ ఇటు కొణిదెల కుటుంబ సభ్యుల అభిమానులనూ ఇలా ఒక్కరేంటి అందరినీ ఫిదా చేస్తుందీ ఫ్లెక్సీ. దీంతో సంబంధిత కటౌట్లు మరియు ఫ్లెక్సీల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.