తెలంగాణ బీఎస్పీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని సరూర్ నగర్ స్టేడియంలో ఆదివారం జరిగిన ‘‘తెలంగాణ భరోసా సభ’’కు రాష్ట్ర బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో బీఎస్పీ నుండి 70 సీట్లు బీసీలకే ఇస్తామని సంచలన ప్రకటన చేశారు. తెలంగాణలో బీఎస్పీ అధికారంలోకి వస్తే కౌలు రైతులకు రూ.5 వేల కోట్లతో నిధి ఏర్పాటు చేస్తామని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హామీ ఇచ్చారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటేనని ఆరోపించారు. కోట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఎక్కడ చూసిన సమస్యలే ఉన్నాయని.. అమరవీరుల త్యాగాలతో వచ్చిన తెలంగాణను కేసీఆర్ కుటుంబం కబ్జా చేసిందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు.
తెలంగాణలోని ఇంచ్ భూమీ లేకుండా కబ్జా చేశారని.. రాష్ట్రంలో ఎక్కడ చూడు బీఆర్ఎస్ దౌర్జన్యాలు, కుంభకోణలు కనిపిస్తున్నాయన్నారు. అవినీతి బీఆర్ఎస్‌ను అధికారంలో ఉంచవద్దని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎన్నడు అంబేద్కర్‌కు దండ కూడా వేయని సీఎం కేసీఆర్ బీఎస్పీకి భయపడి ఆగమేగాల మీద అంబేద్కర్ విగ్రహం కట్టారు.. తెలంగాణ నూతన సచివాలయానికి అంబేదర్క్ పేరు పెట్టారని అన్నారు. తెలంగాణలో దోపిడి దొరలను గద్దె దించేందుకు బీఎస్పీ శ్రేణులు రాత్రిపగలు కష్టపడుతున్నారని.. ఏదో ఒక రోజు ప్రగతి భవన్ మీద నీలి జెండా ఎగరేయడం మాత్రం ఖాయమని దీమా వ్యక్తం చేశారు.