తెలంగాణ రాష్ట్ర బీఎస్పీ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్ 1 పరీక్ష క్వశ్చన్ పేపర్ లీక్ కావడం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ లీకేజీ వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, మంత్రి హరీశ్ రావు హస్తం ఉందని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు చెందిన వ్యక్తులు పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు చెందిన కాన్ఫిడెన్సియల్ సెక్షన్ లో ఉన్నారని… వీరు గ్రూప్ 1 క్వశ్చన్ పేపర్లను కవితకు అందజేశారని చెప్పారు. దీనికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని… సరైన సమయంలో వాటిని హైకోర్టుకు కానీ, సీబీఐకి కానీ అప్పగిస్తానని తెలిపారు.
టీఎస్ పీఎస్సీ ఛైర్మన్ బి. జనార్ధన్ రెడ్డి తక్షణమే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీ వ్యవహారంపై దర్యాప్తు చేసేందుకు ఏర్పాటు చేసిన సిట్ పై తనకు నమ్మకం లేదని ఈ అంశంలో రాష్ట్ర గవర్నర్ జోక్యం చేసుకోవాలని… తన రాజ్యాంగ అధికారాలను ఉపయోగించి ఆర్టికల్ 317 కింద టీఎస్ పీఎస్సీ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డిని డిస్మిస్ చేయాలని కోరారు. చెప్పారు. సిట్ నుంచి డీజీపీ, చీఫ్ సెక్రటరీకి అందే నివేదికలు చివరకు ముఖ్యమంత్రి చేతికి చేరుతాయని…. బాధితులకు ముఖ్యమంత్రి కేసీఆర్ న్యాయం చేస్తారనే నమ్మకం తనకు ఏమాత్రం లేదని అన్నారు.