హైదరాబాద్: తెలంగాణలో రైతుబీమా పథకం దరఖాస్తుకు మరో అవకాశం కల్పించారు. మరో నాలుగు రోజులు పాటు దరఖాస్తులు సమర్పించేందుకు గడువు పెంచారు. ఇప్పటివరకూ దరఖాస్తు చేసుకోని కొత్త పట్టాదారు రైతులకు ప్రభుత్వం శుభవార్త వినిపించిన విషయం తెలిసిందే. అయితే రైతుబీమాకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 11వ తేదీ వరకూ అవకాశం కల్పించారు. ఈ నెల 3లోపు రైతుబీమాకు రిజిస్ట్రర్ చేసుకున్న వారందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.
ఇక ఈ పథకం కోసం ప్రభుత్వం రూ. 800 కోట్లు కేటాయించింది. 2021-22కు సంబంధించిన నిధులను కూడా విడుదల చేసింది. రైతుల తరపు చెల్లించాల్సిన ప్రీమియం గడువు ఈ నెల 13తో ముగుస్తుంది. 14వ తేదీ నుంచి కొత్త ప్రీమియం అమల్లోకి వస్తుంది. రైతులపై భారం పడకుండా ప్రీమియం డబ్బులను ప్రభుత్వమే చెల్లిస్తోంది. రైతుకు అనుకోని ఘటన జరిగితే ఆ కుటుంబానికి రూ 5 లక్షలు చెల్లిస్తారు. గత ఏడాది 32 లక్షల 73 వేల మందికి సంబంధించిన ప్రీమియంను ప్రభుత్వం చెల్లించింది. ప్రతి రైతుపై రూ. 3486 చొప్పున ప్రభుత్వం ప్రీమియం చెల్లిస్తోంది.