ఏపీలో ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా ఇప్పటి నుంచి కసరత్తులు మొదలెట్టారు నేతలు.. ఈ నేపథ్యంలో పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు, పరిశీలకులు, ముఖ్యనేతలతో వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. గృహ సారథుల నియామక ప్రక్రియపై సజ్జల సమీక్ష చేశారు. గృహ సారథుల ఎంపిక గడువు ఈ నెల 20 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు సజ్జల. ఫిబ్రవరి 1 నుంచి 7 వరకు గృహ సారథులతో మండల స్థాయి శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ల అధ్యక్షతన మండల స్థాయి సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ప్రతి 50 ఇళ్లకు ఇద్దరు గృహ సారథులను నియమించనున్నారు. మరింత త్వరగా ప్రజా సమస్యల పరిష్కారానికి గృహ సారథుల వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు సజ్జల. ఇకపోతే.. కొద్దిరోజుల క్రితం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీపై సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. పవన్, చంద్రబాబు కలయికకు అటెన్షన్‌ను క్రియేట్ చేసుకోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. అక్రమం సక్రమని.. వారిది పవిత్ర కలయిక చెప్పడానికి చంద్రబాబు, పవన్ కల్యాణ్ తాపత్రయపడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు కారణంగా 11 మంది చనిపోయారని.. చంపినవాళ్ల దగ్గరికి వెళ్లి పరామర్శించడం ఎక్కడైనా ఉందా? అని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ ముందు చనిపోయిన వాళ్లను పరామర్శించాలని అన్నారు సజ్జల.