ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. ఓ వైపు అధికార పార్టీ వైసీపీ, టీడీపీ మహానాడును విమర్శిస్తోంది. చంద్రబాబుకు తన ఓటమి అర్థమైందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను పెద్ద ఎత్తున టీడీపీ నిర్వహించింది. ఈ క్రమంలో వైసీపీ నేతలు, మంత్రులు టీడీపీ పార్టీని, చంద్రబాబు నాయుడిని తీవ్రంగా విమర్శించారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నాడని విమర్శించారు. ప్రస్తుతం ఉన్నది ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ కాదని.. నారా తెలుగుదేశం పార్టీ అని విమర్శిస్తున్నారు. ఇదిలా ఉంటే టీడీపీ కూడా వైసీపీ నిర్వహిస్తున్న సామాజిక న్యాయభేరి బస్సు యాత్రపై విమర్శలు గుప్పిస్తోంది.
తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైసీపీపై, సీఎం జగన్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. వైసీపీలో పాలనలో సామాజిక న్యాయం ఎక్కడ ఉందని ప్రశ్నించారు. తాడేపల్లి ప్యాలెస్ లోపల సజ్జల రెడ్డి, సాయి రెడ్డి, సుబ్బా రెడ్డి, పెద్ది రెడ్డి ఉంటున్నారని.. గేటు బయట బీసీ, ఎస్సీ, ఎస్టీ నేతలు ఉంటున్నారని విమర్శించారు. రెండు వేల కీలక పదవులు ఒకే సామాజిక వర్గానికి కట్టబెట్టారని ఆరోపించారు. సీఎం వద్ద అటెంటర్ నుంచి ఐఏఎస్ వరకు ఒకే సామాజిక వర్గం ఉందని విమర్శించారు. కుర్చీలు కూడా లేని పదవులు బీసీలకా..? అని ప్రశ్నించారు. మీరు చేయాల్సింది సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర కాదని.. రెడ్డి సామాజిక రైలు యాత్ర అని ఎద్దేవా చేశారు. వాస్తవానికి రైలు కూడా సరిపోనన్ని పదవులు ఒకే సామాజిక వర్గానికి దక్కాయని ఆరోపించారు.