ప్రస్తుతం అంతా ట్రిపుల్ ఆర్ ఫీవర్ నడుస్తుంది.ఈ ఫీవర్ ఎలా ఉన్నా కూడా భరించాలి. ఈ ఫీవర్ ఎంత కాలం ఉన్నా కూడా పరిశీలించాలి. వీలున్నంత మేరకు మంచి మాటలు ఏమయినా ఉంటే యూనిట్ కు చెప్పి చూడాలి. తప్పిదాలు చేస్తూ పోతూ ఉంటే వాటిని కూడా దిద్దుకోవాలని అని చెప్పి చూడాలి. ఇదే సమయాన ఈ మూవీ బడ్జెట్ పై వస్తున్న ఊహాగానాలు కూడా ఓ సారి తరచి చూడాలి. ఎందుకంటే ప్రొడక్షన్ కాస్ట్, ప్రొడక్షన్ వాల్యూ అన్నవి వ్యాపారం లో ఎంతో ముఖ్యమయినవి. ప్రొడక్షన్ కాస్ట్ పావలా అనుకుంటే అమ్మేటప్పటికీ దాని విలువ రూపాయికి పెంచుతున్నారు. దాంతో సినిమా రేటు మరీ ! పెరిగిపోతోంది. ఐదు వందల కోట్ల సినిమా ఎన్ని రోజులు తీస్తే అంత మొత్తం అయింది. ఎంత మందికి డబ్బులు పంచుతూ పోతే అంత పెద్ద సినిమా అయింది అన్నది ఓ సారి ఆలోచించాలి.
ఓ లెక్క తీసుకుందాం.. ఇద్దరూ పెద్ద హీరోలు కనుక వంద కోట్లు రెమ్యునరేషన్ పేరిటే పోయింది అనుకుందాం. రాజమౌళి రెమ్యునరేషన్ ఓ 25 కోట్లు లాభాలు ఓ వంద కోట్లు కలిపి 125 కోట్లు అనుకుందాం. సినిమా ఇంకా అమ్ముడుపోయే స్థితిలో లేనప్పుడు ఆయన పారితోషకం రూపంలో ఓ పాతిక కోట్లు తీసుకున్నారే అనుకుందాం. అంటే ఇక్కడికి ఖర్చు 125 కోట్లు అనుకుందాం. మిగతా ఖర్చు అంతా కలిపి మరో 125 కోట్లు అనుకుందాం అంటే మొత్తం ఖర్చు 250 కోట్లే అనుకుందాం.
కానీ రాజమౌళి లెక్క ప్రకారం ఖర్చు ఐదు వందల కోట్లు అని తేలింది. అంటే ఇక్కడ అర్ధ రూపాయి ఖర్చును రూపాయిగా చూపించారా ? పోనీ అలానే అనుకుందాం. అలా అనుకున్న మొదటిరో్జే ఈ సినిమా 223 కోట్లు రాబట్టిందని అంటున్నారే ! అంటే మిగతావన్నీ లాభాలనేగా ! మరి! అప్పుల లెక్క చూద్దాం సినిమాకు సంబంధించి నెలకు 8కోట్లు చొప్పున వడ్డీ చెల్లించారే అనుకుందాం. అలా చూసుకున్నా కూడా జనవరి నుంచి ఇప్పటిదాకా 24కోట్లు చెల్లించారే అనుకుందాం. ఆ విధంగా లెక్క పెడితే ఇప్పుడొస్తున్న డబ్బులకూ అప్పులకూ అస్సలు సంబంధమే లేదు.
అంటే ఓ భారీ బడ్జెట్ సినిమా తీసి ఎవ్వరిని వీళ్లు ఉద్ధరిస్తున్నారని? ఇందులో ఏమయినా వెల్ఫేర్ కు ఇస్తారా అంటే అదీ లేదు. రాయల సీమ వరదల సమయంలో కూడా రాజమౌళి బృందం స్పందించిన దాఖలాలే లేవు. నిర్మాత (డీవీవీ దానయ్య) ఇస్తే ఇవ్వవచ్చు గాక.. చరణ్ కానీ తారక్ కానీ వ్యక్తిగతంగా తమ వంతు సాయం చేశారు. ఇదంతా గతం.. పోనీ ఇప్పటికైనా ఈ దరిద్రగొట్టు డ్రామాలు వదిలేస్తారా? నిజాయితీగా ఓ చిన్న చిత్రం తీసి విడుదల చేసి తన సత్తా చాటుతారా ? అన్నవి ఇవాళ రాజమౌళిని అడగాల్సిన ప్రశ్నలు.