ఆస్ట్రేలియన్ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ హఠాన్మరణం యావత్ క్రికెట్ ప్రపంచానికి షాక్ కలిగించింది. ఆయన మరణాన్ని క్రికెట్ లోకం జీర్ణించుకోలేకపోతోంది. తాను క్రికెట్ కు అందించిన సేవలను కొనియాడుతోంది క్రికెట్ ప్రపంచం. నిన్న థాయ్ లాండ్ లో గుండె పోటుతో షేన్ వార్న్ మరణించారు.
షేన్ వార్న్ మృతి చెందడంపై టీమిండియా నివాళులు అర్పించింది. శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్ట్ రెండో రోజు ఆటకు ముందు ఒక నిమిషం పాటు ఆటగాళ్లు మౌనం పాటించారు. షేన్ వార్న్ తో పాటు మరో ఆస్ట్రేలియన్ దిగ్గజం రాడ్ మార్ష్ కు సంతాప సూచకంగా మైదానంలో నిలబడి మౌనం పాటించారు. సంతాప సూచకంగా నల్లటి ఆర్మ్ బ్యాండ్ తో ధరించారు.
షేన్ వార్న్ మరణం పట్ల టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వార్న్ మరణ వార్తతో కుంగిపోయానని.. ఇది క్రికెట్ ప్రపంచానికి తీరని లోటు అని వ్యాఖ్యానించారు. వార్న్ కుటుంబానికి తన సానుభూతి తెలియజేశాడు. జీవితం అనూహ్యమైనదని.. వార్న్ మరణ వార్త విని షాక్ లో ఉన్నానని స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అన్నాడు.