దివంగత వైఎస్సార్ కుమార్తెగా, జగన్ సోదరిగా ఉన్న షర్మిల..తెలంగాణలో వైఎస్సార్టీపీ అనే పార్టీ పెట్టి..తనకంటూ ఓ గుర్తింపు ఉండాలనే దిశగా ముందుకెళుతున్న విషయం తెలిసిందే. తాను తెలంగాణ కోడలు అని, ఇక్కడ కూడా రాజన్న రాజ్యం తెస్తానని చెప్పి రాజకీయాలు నడుపుతున్నారు. అయితే అనుకున్న విధంగా షర్మిల రాజకీయాలు సక్సెస్ అవ్వడం లేదు..పార్టీ బలపడటం లేదు. ఈ క్రమంలో ఆమె రూట్ మార్చి కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం, ఎక్కడ పాదయాత్ర చేస్తే..అక్కడ స్థానిక ఎమ్మెల్యేపై గాని, మంత్రిపై గాని పరుష పదజాలంతో విమర్శలు చేయడం మొదలుపెట్టారు.
ఎమ్మెల్యేలని, మంత్రులని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి విరుచుకుపడుతున్నారు. అప్పుడప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు షర్మిలకు గట్టిగానే కౌంటర్లు ఇచ్చారు. కానీ తాజాగా నర్సంపేటలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని టార్గెట్ చేశాక సీన్ మారింది. షర్మిల పాదయాత్రపై టీఆర్ఎస్ శ్రేణులు దాడులు చేయడం, పోలీసులు పాదయాత్రని అడ్డుకోవడం, హైదరాబాద్‌లో షర్మిలని అరెస్ట్ చేయడంతో సీన్ మారింది. ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాల్లో షర్మిల హైలైట్ అయ్యారు.
ఇదే సమయంలో షర్మిలకు బీజేపీ నేతలు సానుభూతి తెలిపారు. దీనిపై టీఆర్ఎస్ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. కమలం వదిలిన బాణం షర్మిలఅని చెప్పి కవిత సెటైర్ వేశారు. అటు షర్మిల కూడా అదే స్థాయిలో కౌంటర్లు ఇచ్చారు. ఆ విషయం పక్కన పెడితే..ఇప్పుడు నిజంగానే షర్మిల..బీజేపీ వదిలిన బాణమేనా అని డౌట్ పడే పరిస్తితి. ఎందుకంటే ఆమె..టీఆర్ఎస్‌తో పాటు కాంగ్రెస్ పార్టీని గట్టిగా టార్గెట్ చేస్తున్నారు తప్ప..బీజేపీపై గాని, బీజేపీ నేతలుపై గాని పెద్దగా విమర్శలు చేయడం లేదు.
అంటే పరోక్షంగా బీజేపీకి మద్ధతుగా ఉన్నారా? అనే డౌట్ వచ్చేలా చేస్తున్నారు. పైగా షర్మిల పాదయాత్రపై దాడి చేస్తే ఎక్కువ రియాక్ట్ అయింది బీజేపీ నేతలే. దీంతోనే అనుమానం ఇంకా పెరుగుతుంది. అంటే షర్మిల ద్వారా..ఎస్సీ, రెడ్డి, క్రిస్టియన్ ఓట్లని చీల్చి టీఆర్ఎస్, కాంగ్రెస్‌లని దెబ్బకొట్టి పరోక్షంగా బీజేపీకి లబ్ది చేకూరేలా చేస్తున్నట్లు కనిపితోంది. అందుకే షర్మిలని..కమలం వదిలిన బాణం అంటున్నారు.