‘అడ్డుపడితే కాళ్లు విరగ్గొట్టండి’.. ఠాక్రే వర్గంపై శిందే వర్గం ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

-

మహారాష్ట్రంలో శివసేన, శిందే వర్గం మధ్య వార్ ఇంకా నడుస్తూనే ఉంది. బహిరంగంగానే ఒకరిపై ఒకరు అనుచిత వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఠాక్రే వర్గాన్ని హెచ్చరిస్తూ శిందే వర్గం ఎమ్మెల్యే ఒకరు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘‘మీకు అడ్డుపడితే వాళ్ల(ఠాక్రే వర్గాన్ని ఉద్దేశిస్తూ) కాళ్లు విరగ్గొట్టండి.. అవసరమైతే నేను బెయిల్‌ ఇప్పిస్తా’’ అంటూ ఆ ఆమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి దారితీశాయి.

ముంబయిలోని మాగాఠణే ప్రాంతంలో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఆ ప్రాంత ఎమ్మెల్యే ప్రకాశ్‌ సుర్వే పాల్గొన్నారు. ‘‘ఎవరిది నిజమైన శివసేన? దీని గురించి మీకు ఎవరైనా ఏమైనా చెబితే గట్టిగా జవాబు చెప్పండి. ఎవరి దాదాగిరీని సహించేది లేదు. అవసరమైతే వారిని కొట్టండి. మీకు ప్రకాశ్‌ సుర్వే ఉన్నాడు. వాళ్ల చేతులు విరగొట్టలేకపోతే కాళ్లు విరగ్గొట్టండి. ఆ తర్వాత రోజు నేనొచ్చి మీకు బెయిల్‌ ఇప్పిస్తా’’ అని కార్యకర్తలకు సూచించారు. తాము ఎవరి జోలికీ వెళ్లబోమని, కానీ తమ జోలికి ఎవరైనా వస్తే మాత్రం వదిలిపెట్టబోమని ఆయన హెచ్చరించారు.

ఇందుకు సంబంధించిన వీడియో స్థానిక మీడియాలో వైరల్‌గా మారడంతో ఠాక్రే వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యే ప్రకాశ్‌ సుర్వేపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై ఠాక్రే వర్గంతో పాటు ప్రతిపక్ష ఎన్సీపీ నేడు మీడియా సమావేశం నిర్వహించనుంది. అటు సీఎం శిందే కూడా మీడియా ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version