దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. రోజూ లక్షల సంఖ్యలో కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. అనేక రాష్ట్రాల్లో కోవిడ్ బాధితుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. దీంతో కేంద్రం కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు అన్ని రకాల చర్యలను తీసుకుంటోంది. ఇక మరోవైపు కోవిడ్ టీకాల పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని, మరింత మందికి టీకాలను అందివ్వాలని కేంద్రం ఆలోచిస్తోంది. అందులో భాగంగానే 45 ఏళ్ల కన్నా తక్కువ వయస్సు ఉన్నవారికి కూడా టీకాలను ఇవ్వాలని సన్నాహాలు చేస్తున్నారు.
దేశంలో కోవిడ్ టీకాల పంపిణీ 3వ దశ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. 45 ఏళ్లకు పైబడిన వారికి ఈ దశలో టీకాలను ఇస్తున్నారు. అయితే కోవిడ్ కేసుల సంఖ్య పెరిగిపోతుండడంతో టీకాలను ఇవ్వడం ఒక్కటే మార్గం అని నిపుణులు చెబుతున్నారు. దీంతో కేంద్రం 45 ఏళ్ల కన్నా తక్కువ వయస్సు ఉన్నవారికి కూడా టీకాలను అందించేందుకు సిద్ధమవుతోంది. అలాగే ఇప్పుడు ఇస్తున్న దాని కన్నా మరింత భారీ స్థాయిలో టీకాలను అందించేందుకు సిద్ధమవుతున్నారు.
కాగా దేశంలోని పౌరులకు ఇంటింటికీ వెళ్లి టీకాలను అందిస్తామని కూడా పలు కంపెనీలు కేంద్రాన్ని కోరాయి. కానీ కేంద్రం దీనిపై ఇంకా తన వైఖరిని తెలియజేయలేదు. అయితే ఈ విషయంపై కూడా కేంద్రం నిర్ణయం తీసుకోనుంది. ఇందుకు అనుమతిస్తే మరింత మందికి టీకాలను ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. దీని వల్ల కోవిడ్ వ్యాప్తిని అడ్డుకోవచ్చు. అయితే ఈ విషయాలపై కేంద్రం ఎప్పటి వరకు నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.