కొవిడ్ విజృంభణ నేపథ్యంలో టీకాలు ఉత్పత్తి పెరిగింది. ఇప్పటి వరకు దాదాపు నాలుగుకోట్ల జనాభా టీకా తీసుకున్నారు. మొదట్లో వెనుకడుగేసిన ప్రజలు కరోనా సెకండ్‌వేవ్ ప్రాణాంతకంగా మారడంతో వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు. సెకండ్ డోస్ నేపథ్యంలో ఫస్ట్ డోస్ ప్రక్రియ నిలిపివేసింది. త్వరలో ఆ ప్రక్రియ కూడా ప్రారంభిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఇక విద్యార్థులు కూడా టీకా తీసుకునే వెసులుబాలు తీసుకువచ్చింది తెలంగాణ ప్రభుత్వం. కానీ, ఇది అందరికీ కాదు..కేవలం విదేశాలకు వెళ్లే వారికోసం ప్రత్యేకంగా డ్రైవ్ చేపట్టింది.
ప్రత్యేకంగా హైదరాబాద్‌లోని నారాయణగూడ ఐపీఎంలో విద్యార్థుల కోసం వ్యాక్సిన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. టీకా తీసుకోవడానికి అర్హత ఉన్న విద్యార్థులు స్లాట్ల నమోదు కోసం శుక్రవారం నుంచి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపింది. ఇందుకోసం వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేకంగా స్లాట్ బుకింగ్ విధానాన్ని రూపొందించినట్లు ప్రకటించింది. www.Health.telangana.gov.inలో స్లాట్ల కోసం దరఖాస్తు చేయవచ్చని తెలిపింది.
ఈ నెల 5 న అంటే బుకింగ్ చేసుకున్న మరుసటి రోజు శనివారం నుంచి వ్యాక్సినేషన్ కోసం స్లాట్లు అందుబాటులో ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది. కేవలం విదేశాలకు వెళ్లే విద్యార్థులకే కాకుండా టూరిస్ట్‌గా వెళ్లేవారికి కూడా కొన్ని దేశాలు టీకాను అందించనున్నాయని ఇటీవలి వార్తల్లో చూశాం. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చేపట్టిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. దాదాపు భారత్‌లో ఉండే ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకునే వరకు ఈ ఏడాది చివరి వరకు సమయం పట్టవచ్చని పరిశోధకులు తెలిపారు. కొవిడ్ టీకాను చిన్న పిల్లలకు కూడా వేయడానికి సిద్ధం చేస్తున్న టీకా రెండో దశ ట్రయల్‌లో ఉంది.