ఐపీఎల్‌-14… తొలి మ్యాచ్‌లో నెగ్గేదెవరో..?

-

ఓ వైపు దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోన్నా… ఐపీఎల్‌-14ను విజయవంతం చేయాలని బీసీసీఐ పట్టుదలతో ఉంది. ఎన్నో సవాళ్ళ మధ్య నేడు టోర్నీ ప్రారంభం కానుంది. ఇక ఆటగాళ్ళు, సిబ్బంది అంతా దాదాపు రెండు నెలలు బయో బబుల్‌లోనే ఉండనున్నారు. నేడు రాత్రి 7.30 గంటలకు జరగనున్న తొలి మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్లు తలపడనున్నాయి.


ఇక జట్ల విషయానికి వస్తే బెంగళూరు కంటే ముంబయి అన్ని విభాగాల్లో చాలా బలంగా కనిపిస్తోంది. రోహిత్‌, డికాక్‌, ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌, హార్దిక్‌, కృనాల్‌, పొలార్డ్‌ లాంటి మ్యాచ్ విన్నర్లు ముంబయి సొంతం. వీరంతా సింగిల్ హ్యాండ్ తో మ్యాచ్ ను మలుపు తిప్పగల సమర్థులు. ఇక బుమ్రా, బౌల్ట్‌ల పేస్ ద్వయం ప్రత్యర్థి జట్టు బ్యాట్స్ మెన్ ను కట్టడి చేయడానికి సిద్దంగా ఉంది.

అవకాశం వస్తే తమ సత్తా చూపడానికి నాథన్ కౌల్టర్ నైల్, క్రిస్ లిన్, ఆడమ్ మిల్నే లాంటి విదేశీ స్టార్లు ఆ జట్టులో ఉన్నారు. సీనియర్ స్పిన్నర్ పియూష్ చావ్లా, రాహుల్ చాహర్, జయంత్ యాదవ్ లు కూడా అవకాశం వస్తే సత్తా చూపాలనే పట్టుదలతో ఉన్నారు. సచిన్‌ టెండూల్కర్ కొడుకు అర్జున్‌ టెండూల్కర్ ముంబయి జట్టుకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు. మరి అతనికి అవకాశం వస్తుందో లేదో చూడాలి మరి.

బెంగళూరు జట్టు పేపర్ పై బలంగా కనిపిస్తున్నా మైదానంలో మాత్రం సరైన ప్రదర్శన చేయకపోవడంతో ఓటములు తప్పడం లేదు. ఆ జట్టుకు కెప్టెన్ కోహ్లీ, ఏబీ డివిల్లియర్స్ ప్రధాన బలం. వీరు చెలరేగితే బ్యాటింగ్ లో ఆ జట్టుకు తిరుగుండదు. ఇక గత సీజన్లో మంచి ప్రదర్శన చేసి ఓపెనర్, యువ ఆటగాడు దేవదత్ పడిక్కల్ నుంచి బెంగళూరు మంచి ప్రదర్శను ఆశిస్తుంది. ఇక ఆసీస్ అల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ ఈ సారి బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు.

గత కొన్ని సీజన్లలో పంజాబ్ తరపున ఎన్నో మ్యాచ్ లు ఆడిన మ్యాక్స్ వెల్ ఆశించిన ప్రదర్శన చేయకపోవడంతో.. ఈ సారి అతన్ని బెంగళూరు దక్కించుకుంది. మరి బెంగుళూరు తరపున మ్యాక్స్ వెల్ ఎలాంటి ప్రదర్శన చేస్తాడని ఉత్కంఠ నెలకొంది. న్యూజిలాండ్‌ యువ ఆల్‌రౌండర్‌ జెమీసన్‌ను రూ.15 కోట్లు పెట్టి కొనుకున్న బెంగుళూరు అతని నుంచి మంచి ప్రదర్శనను ఆశిస్తోంది. అవకాశం వస్తే సత్తా చూపడానికి విదేశీ ఆటగాళ్ళు ఫిన్ అలెన్‌, డానియల్ క్రిస్టియన్ లు సిద్ధంగా ఉన్నారు. ఇక భారత ఆటగాళ్ళు చాహాల్, సిరాజ్, నవదీప్ సైనీ, సుందర్ లు కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే బెంగుళూరుకు తిరుగుండదు.

Read more RELATED
Recommended to you

Latest news