భారత క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. యూఏఈలో టీ20 వరల్డ్ కప్..?

భారత్ వేదికగా ఈ ఏడాది అక్టోబ‌ర్‌, న‌వంబ‌ర్‌ల‌లో జ‌ర‌గాల్సిన టీ20 వరల్డ్ కప్ మన దేశంలో జరిగేది అనుమానంగానే మారింది. భారత్‌లో కరోనా పరిస్థితుల నేపథ్యంలో టీ20 వరల్డ్ కప్ యూఏఈకి తరలిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బీసీసీఐ సెక్రటరీ జై షా వ్యాఖ్యలతో భారత్‌లో పొట్టి ప్రపంచ కప్ నిర్వహణ కష్టమేనని అర్థమవుతుంది.

టీ20 వరల్డ్ కప్ నిర్వహణపై జై షా మాట్లాడుతూ… దేశంలో ఇపుడున్న కరోనా పరిస్థితుల దృష్ట్యా భారత్‌లో జరగాల్సిన టీ20 వరల్డ్ కప్ ను యూఏఈకి తరలించే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితులను బీసీసీఐ నిశితంగా పరిశీలిస్తుందని, క్రికెటర్ల ఆరోగ్యం మరియు భద్రత తమకు చాలా ముఖ్యమని స్పష్టం చేసారు. అయితే టీ20 వరల్డ్ కప్ నిర్వహణపై త్వరలో అంతిమ నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసారు.

అయితే ఈ ఏడాది ఏప్రిల్లో ఐపీఎల్‌ టోర్నీ మధ్యలోనే వాయిదా పడడంతో భారత్‌లో టీ20 వరల్డ్ కప్ జరగడంపై అప్పుడే అనేక అనుమానాలు మొదలయ్యాయి. అయితే ఐపీఎల్‌ టోర్నీలో 29 మ్యాచులే జరగగా మిగిలిన మ్యాచ్ లను సెప్టెంబర్‌ 19 నుంచి అక్టోబర్‌ 15 వరకు యూఏఈలో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఇక ఇదే తరహాలో టీ20 వరల్డ్ కప్ ను కూడా యూఏఈకి తరలిస్తారా లేక భారత్‌లో నిర్వహించేందుకు ఏమైనా ప్రణాళికలు సిద్ధం చేస్తారా వేచి చూడాలి.