వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణపై కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పెట్టుకుంది బీజేపీ. ఆ దిశగా ఇప్పటికే ప్రయత్నాలు కూడా మొదలుపెట్టింది. గులాబీ తోటలో కమలాన్ని వికసింపజేసేందుకు ప్రణాళికలు కూడా రెడీ చేసింది. ఇందులో భాగంగానే మూడు నెలల షెడ్యూల్ రూపొందించింది. ఈ క్రమంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్రవ్యవహారాల ఇంచార్జి సునీల్ బన్సల్.. నేడు, రేపు రాష్ట్రంలో పర్యటించనున్నారు.
ఉదయం హైదరాబాద్ కూకట్పల్లిలో జరగనున్న.. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ భేటీకి సునీల్ బన్సల్ హాజరుకానున్నారు. మధ్యాహ్నం రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ అధ్యక్షతన జరిగే పార్లమెంట్ కన్వీనర్, సహకన్వీనర్, పార్లమెంట్ ప్రభారీ, పార్లమెంట్ విస్తారక్ భేటీలో పాల్గొననున్నారు. రేపు ఉదయం పటాన్చెరులో జరిగే మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం, మధ్యాహ్నం భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో సునీల్ బన్సల్ పాల్గొననున్నారు.
రెండ్రోజుల పర్యటనలో పార్టీ పటిష్టత, ప్రజా సమస్యలపరిష్కారం, కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లే అంశంపై చర్చించనున్నారు. భవిష్యత్ ప్రణాళికలు, బీఆర్ఎస్ ప్రజావ్యతిరేక విధానాలు వాటిపై ప్రజాఉద్యమాలను కార్యరూపంలోకి తెచ్చేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలను రూపొందించనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి