పెద్ద నోట్లని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాకలైన పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ అంశంపై సుప్రీంకోర్టులో 58 పిటిషన్లు దాఖలు అయ్యాయి. రూ. 1000, రూ.500 నోట్లను రద్దు చేస్తూ కేంద్రం అప్పట్లో తీసుకున్న నిర్ణయాన్ని పలువురు అత్యున్నత న్యాయస్థానంలో సవాలు చేశారు.
జస్టిస్ ఎన్ ఎ నజీర్ సారధ్యంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ జరిపింది. న్యాయమూర్తులు గవాయ్, నాగరత్న, ఏఎస్ బొమ్మై, వి రామసుబ్రహ్మణ్యన్ లు ఈ ధర్మాసనంలో ఉన్నారు. 2016 నవంబర్ 8న కేంద్రం పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి సంబంధించిన రికార్డులను తమకు సమర్పించాలంటూ గత డిసెంబర్ 8న కేంద్రం, ఆర్బిఐ ని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. శీతాకాల చెరువుల అనంతరం సుప్రీంకోర్టు సోమవారం ( నేడు ) తిరిగి ప్రారంభం అయింది.
ఈ నేపథ్యంలో పెద్ద నోట్ల రద్దు పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టు కీలకతీర్పుని వెలువరించింది. నోట్ల రద్దు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్ధించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన 58 పిటిషన్ లపై సుదీర్ఘ విచారణ జరిపిన ఎన్ నజీర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇవాళ ఈ తీర్పును వెలువరించింది. ఆర్బిఐ యాక్ట్ సెక్షన్ 26 (2) ప్రకారం భారత సెంట్రల్ బ్యాంకుకు ఈ అధికారం ఉందని స్పష్టం చేసింది.