టీ కాంగ్రెస్ నేతల్లో కొత్త ఉత్సాహం వచ్చినట్టేనా..ఇంతకాలం డీలా పడి సైలెంట్ గా ఉన్న కాంగ్రెస్ నేతలు ఒక్కసారిగా రోడ్డెక్కుతున్నారు. పాద యాత్రల బాట పడుతున్నారు. రైతుచట్టాలను వ్యతిరేకిస్తూ, స్థానిక సమ్యలను లేవనెత్తుతూ గ్రామాల్లో తిరుగుతున్నారు. రేవంత్ రెడ్డి పాదయాత్రతో మరో ముగ్గురు నేతలు ఇదే రూట్లోకి వచ్చారు. దీంతో ఇంతకాలం స్తబ్దుగా ఉన్న కేడర్ లో కూడా ఉత్సాహం మొదలైంది.
వరుస పాదయాత్రలతో టీ కాంగ్రెస్ నేతలు జనంబాట పట్టారు. పార్టీలో నేతల విభేదాలు ఇతర సంక్షోభాలనుంచి బయటపడి ఒక్కసారిగా జనాల్లోకి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక సమయంలో తెలంగాణ పొలిటికల్ గ్రాఫ్ లో నిన్న మొన్నటి వరకు పోటీలో లేమన్నట్లు సైడ్ అయ్యారు టీ కాంగ్రెస్ సీనియర్లు. ఇక ఎన్నికల ఫలితాలు కూడా దానికి తగ్గట్టే వచ్చాయి. ఢీలాపడి సైలెంట్ గా ఉన్న నేతలు ఇప్పుడు ఒక్కసారిగా జోరును పెంచారు. ఇక పార్టీ కేడర్ లో కూడా ఆలస్యంగా అయినా వాస్తవాల్ని గుర్తించారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఇప్పటికే రేవంత్,భట్టీ పాదయాత్రలు పర్యటనలు ఉత్సహం నింపగా.. ఇప్పుడు మరో ఇద్దరు నేతలు సైతం రోడ్డెక్కేందుకు సిద్ధమయ్యారు. ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామంటున్నారు. ఖమ్మంలో జరిగిన విస్తృత కార్యకర్తల సమావేశం తర్వాత టీ కాంగ్రెస్ నేతలు జనం బాటపట్టారు. ప్రజల వెంట నడవక పొతే కష్టమనే భావనకు వచ్చినట్టుగా, ఒక్కసారిగా స్పీడు పెంచారు. ఉరుకులు పరుగులతో పాదయాత్రలు మొదలు పెట్టారు.
రేవంత్ రెడ్డి పాదయాత్ర పూర్తి చేసుకుని భారీ బహిరంగ సభతో కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపారు. అచ్చం పేట నుంచి రావిరాల వరకు సాగిన రేవంత్ పాదయాత్రలో స్థానిక సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగారు. అటు కేంద్రంపై, ఇటు రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడి రైతులపై ఇద్దరిదీ సవతి ప్రేమే అని ఎండగట్టారు.మరోవైపు.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆదిలాబాద్ జిల్లా నుండి రైతు ముఖాముఖి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.మండలాల్లో రైతులను కలుసుకుంటూ, వారి సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగారు.
ఇప్పుడు మరో ఇద్దరు సీనియర్ నాయకులు కూడా యాత్ర కు రెడీ అయ్యారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిలు పాదయాత్రలకు తేదీలు ఖరారు చేసుకున్నారు. ఈ నెల 20 నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి యాత్ర ప్రారంభం కానుంది. నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలంలోని తన సొంత గ్రామం బ్రాహ్మణ వెల్లెంల నుంచి హైదరాబాద్ లోని ఇరిగేషన్ కార్యాలయం వరకు వెంకట్ రెడ్డి యాత్ర చేయనున్నారు. ప్రాజెక్టుల సాధన యాత్ర పేరుతో… కోమటి రెడ్డి యాత్ర సాగనుంది.
మరో సీనియర్ నాయకుడు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పాదయాత్ర తేదీలు ఖరారు చేశారు. ఈ నెల22 నుంచి వారం పాటు జగ్గారెడ్డి పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. జగ్గారెడ్డి తన నియోజకవర్గం లోని మెడికల్ కాలేజీ, సంగారెడ్డి పేదలకు ఇండ్ల పట్టాలు లాంటి సమస్యలతో పాటు..కొనుగోలు కేంద్రాల ఎత్తివేతకు నిరసనగా పాదయాత్ర చేయబోతున్నారు. సదాశివపేట నుండి..గన్ పార్క్ వరకు పాదయాత్ర గా చేరుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఈ యాత్రలన్నీ చూస్తుంటే టీ కాంగ్రెస్ స్తబ్థత నుండి బయటపడి మళ్లీ ప్రజలకు చేరువయ్యే ప్రయత్నాలు గట్టిగానే చేస్తోందనే టాక్ వస్తోంది. నేతల మధ్య పోటీ సంగతి ఎలా ఉన్నా, ఇంటికే పరిమితమైన సీనియర్లతో ఓ దశలో అసలు రాష్ట్రంలో కాంగ్రెస్ ఉందా అనే అనుమానం ఏర్పడింది. ఇప్పుడు సమస్యలపై స్పందిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, బలపడే ప్రయత్నం చేయటం పార్టీకి మేలు చేకూరుకుస్తుందనే అభిప్రాయాలున్నాయి.