సాగర్ లో కాంగ్రెస్ కొత్త వ్యూహం..జానారెడ్డి ప్లాన్ సక్సెస్ అవుతుందా ?

-

నాగార్జునసాగర్ ఉపఎన్నిక కాంగ్రెస్‌కి చావో రేవోలా మారింది. ఎట్టి పరిస్థితిల్లో జానారెడ్డి గెలిచి తీరాలి అన్నది టీ కాంగ్రెస్ నేతల ఆలోచన లేదంటే తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి మరింత గందరగోళంగా తయారయ్యే అవకాశం ఉంది. ఇప్పటి వరకు జరిగిన వరస ఎన్నికల్లో ఓటమితో ఢీలా పడిన నాయకత్వానికి ఉపఎన్నిక కత్తిమీద సాములా మారింది. దీంతో కొత్త వ్యూహనికి తెర లేపింది కాంగ్రెస్. ఇందులో భాగాంగా టీఆర్ఎస్, బీజేపీయేతర పక్షాలు ఏకం చేసేపనిలో పడ్డారు జానారెడ్డి.

సాగర్ లో సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జానారెడ్డి బరిలో ఉండటం తో గెలుపుపై ధీమాతో ఉన్నారు పార్టీ నాయకులు. అయితే అవతలి పక్షానికి‌ ఏ చిన్న చాన్ ఇవ్వకుండా వ్యూహాలు సిద్దం చేస్తుంది కాంగ్రెస్. జానారెడ్డి గెలిస్తే.. రాష్ట్రంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్యే పోటీ ఉంటుందని ప్రచారం చేసుకోవచ్చు. ఆ మేరకు రాజకీయ వాతావరణం నెలకొల్పడానికి అవకాశం ఉంటుందని లెక్కలు వేసుకుంటున్నారు. అలా కాకుండా టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్యలో బీజేపీ వచ్చిందంటే.. హస్తం పార్టీ ప్రమాదంలో పడినట్టే. ఇవన్నీ చూసిన కాంగ్రెస్‌ నాయకులు.. సాగర్‌ ఉపఎన్నికలో అన్ని అస్త్రశస్త్రాలను ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నారు.

తెలంగాణలో బీజేపీ మినహా టీఆర్ఎస్ కి వ్యతిరేకంగా పనిచేసే శక్తులను ఏకం చేయాలని కాంగ్రెస్‌ చూస్తుంది. పట్టభద్రలు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత సాగర్‌లో ప్రతిపక్ష ఓటు చీలకుండా కసరత్తు మొదలుపెట్టింది. వామపక్ష నాయకులకు పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్వయంగా ఫోన్‌ చేసి మద్దతు కోరారు. ఒకటి రెండు రోజుల్లో కమ్యూనిస్ట్‌ నాయకులతో ఆయన చర్చించే అవకాశం ఉంది. అయితే..సీపీఐ ఒక్కోసారి ఒక్కోఅంశాన్ని ప్రధానంగా తీసుకుంటోంది. ప్రస్తుతం గులాబీ పార్టీ పై సీపీఐ కొంత సంతృప్తితో ఉందని చెబుతున్నారు. అలాగే కాంగ్రెస్‌తో కలిసి పని చేయడానికి ఇబ్బంది కూడా లేదని చర్చ నడుస్తోందట. కాకపోతే సాగర్‌లో మద్దతు ఇచ్చే అంశంపై ఇంకా క్లారిటీ రాలేదు. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మోసం చేసిందనే ఫీలింగ్‌లో ఉన్నారు సీపీఐ నేతలు.

ఇక సీపీఎం కాంగ్రెస్‌తో కలిసి పనిచేయడానికి కొంత ఆలోచన చేస్తోందట. సాగర్‌ బైఎలక్షన్‌లో టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా పనిచేయడంతోపాటు.. బీజేపీ ఎదగ కూడదు అన్న కామన్‌ అజెండాతో లెఫ్ట్‌ పార్టీలు ఉన్నాయట. బీజేపీని కట్టడి చేయడం కోసమే కాంగ్రెస్‌కు మద్దతిస్తాయని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. టీజేఎస్ చీఫ్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ సాగర్‌ ఉపఎన్నికపై ఎలాంటి స్టాండ్‌ తీసుకోలేదు. ప్రచారానికి వెళ్లను, ఎవరికీ మద్దతివ్వను అని ప్రకటించేశారు. కాంగ్రెస్‌ సహా మిగతా విపక్ష పార్టీలు ఆయన మద్దతు కోరే అవకాశం లేకపోలేదు.

దీంతో తెలంగాణ రాజకీయం అంతా నాగార్జునసాగర్‌ ఉపఎన్నిక చుట్టూ తిరుగుతోంది. విపక్ష పార్టీలు కాంగ్రెస్ అభ్యర్ది జానరెడ్డికి మద్దతిస్తాయా లేక ఎవరి దారి వారు చూసుకుంటారా అన్నది చూడాల్సి ఉంది.

 

Read more RELATED
Recommended to you

Latest news