రెండు నెలల్లో 8వ తరగతి విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్ లు ఇస్తామని..ఏపీ సీఎం జగన్ ప్రకటన చేశారు. రూ.931.02 కోట్లతో.. జగనన్న విద్యాకానుక కిట్లను సీఎం జగన్ మోహన్ రెడ్డి పంపిణీ చేశారు. కర్నూలు జిల్లా ఆదోనిలో సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా కిట్ల పంపిణీ చేశారు.
వరుసగా మూడో ఏడాది ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్ల పిల్లలకు అందజేశారు సీఎం జగన్. బడులు తెరిచిన తొలిరోజు నుంచే విద్యార్థులకు కిట్లు అందిస్తోంది జగన్ సర్కార్. జగనన్న విద్యాకానుక పథకం ద్వారా 1-10వ తరగతి వరకు చదువుతున్న 47,40,421 మందికి లబ్ధి చేకూరనుంది. ఇక ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ…పాఠశాలలకు వెళ్లేలా విద్యార్థులను ప్రోత్సహించడంలో భాగంగా అమ్మ ఒడి పథకం కింద 15000 ఇస్తున్నట్లు సీఎం జగన్ చెప్పారు. ఎనిమిదో తరగతి అడుగుపెట్టే ప్రతి విద్యార్థికి సెప్టెంబర్ లోనే ట్యాబులు ఇస్తామని ప్రకటించారు. ఒక్కో ట్యాబ్ విలువ 12000 ఉంటుంది… నాలుగు లక్షల డెబ్బై వేల మందికి ఈ ట్యాబ్ అందిస్తామని స్పష్టం చేశారు సీఎం జగన్. పిల్లల భవిష్యత్తు మార్చేలా ఈ ట్యాబులను అందిస్తున్నట్లు తెలిపారు.